ఫార్ములా ఈ-రేస్ కేసు అక్టోబర్ 30కి వాయిదా
విదేశీ సంస్థకు సమన్లు అందకపోవడంతో విచారణకు బ్రేక్
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : ఫార్ములా ఈ-రేస్ కేసు(Formula E race case)పై నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు(Nampally ACB Special Court)లో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కోర్టుకు హాజరయ్యారు. విచారణ అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది. ఈ- రేసు నిర్వహించిన విదేశీ సంస్థ(Foreign organization)కు కోర్టు సమన్లు అందలేదని కేటీఆర్ తరఫు న్యాయవాది తెలిపారు. సమన్లు అందకపోవడంతో కేసు విచారణను వాయిదా వేసినట్లు వివరించారు.
విదేశీ సంస్థకు ఈ-మెయిల్ ద్వారా సమన్లు పంపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. గతంలో కూడా విదేశీ సంస్థకు సమన్లు జారీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశామని, అయితే ఆ పిటిషన్‌ను న్యాయస్థానం రిటర్న్ చేసిందని కేటీఆర్ న్యాయవాది పేర్కొన్నారు. దీంతో మరోసారి సమన్ల కోసం పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. విదేశీ సంస్థకు సమన్లు ఏ విధంగా అందించాలన్న అంశంపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని న్యాయవాది చెప్పారు.
తాము దాఖలు చేయనున్న తాజా పిటిషన్‌పై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా, ఫార్ములా ఈ-రేస్ కేసు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రాధాన్యత సంతరించుకుంది. కేసుకు సంబంధించి ఏసీబీ దర్యాప్తు, కోర్టు విచారణ నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 30న జరిగే విచారణలో సమన్ల అంశంపై కోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది.