సీజ్ చేసినా మారట్లే?
- హత్నూర, దౌల్తాబాద్‌లో మళ్లీ యథావిధిగా అక్రమ వైద్య కేంద్రాల నిర్వహణ
- నెల గడవకముందే తెరుచుకున్న తలుపులు
- అధికారుల తనిఖీలు ‘నామమాత్రమేనా’?
హత్నూర, సెప్టెంబరు 17: సంగారెడ్డి జిల్లా(Sangareddy District) హత్నూర మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో కొందరు ఆర్‌ఎంపీలు, పీఎంపీల అక్రమ వైద్య(Illegal medical practice) దందా మళ్లీ మొదలైంది. నెల రోజుల కిందట జిల్లా స్థాయి అధికారులు దాడులు చేసి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్లినిక్లను సీజ్ చేసినా సరే, వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. సీజ్ చేసిన కొద్దిరోజులకే మళ్లీ యథాతథంగా బోర్డులు తిరగవేసి, చికిత్సల పేరుతో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతుండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
అప్పట్లో ఊహాగానాలు.. నేడు యథావిధిగా ఆగడాలు
ఈ నెల ప్రారంభంలో (సెప్టెంబరు 3న) జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డిఐఓ) డాక్టర్ శశాంక్ దేశ్పాండే(Shashank Deshpande), ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు హత్నూర, దౌల్తాబాద్, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రథమ చికిత్స కేంద్రాల్లో పడకలు (బెడ్స్) వేసి ఎంబీబీఎస్ స్థాయి వైద్యం అందిస్తున్న 7 ఆర్‌ఎంపీ క్లినిక్ల(RMP Clinics)తో పాటు పలు ల్యాబ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లను సీజ్ చేశారు.
అంతేగాక దౌల్తాబాద్లోని దేవి క్లినిక్, లైఫ్ కేర్ డయాగ్నోస్టిక్ సెంటర్ల(Life Care Diagnostic Centers)కు రూ.25 వేల చొప్పున భారీ జరిమానాలు కూడా విధించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తున్న 9 మెడికల్ షాపులకు నోటీసులు జారీ చేశారు. అయితే అధికారుల తనిఖీల పర్వం ముగిసి నెల గడవకముందే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. సీజ్ చేసిన కేంద్రాలను నిర్భయంగా తెరిచి, అర్హతకు మించి మోతాదు మించిన యాంటీబయోటిక్స్, స్లున్లు, ఇంజెక్షన్లు ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బోర్డులకే పరిమితమైన చట్టాలు..
ఆర్‌ఎంపీ కేంద్రాల బోర్డులపై ‘ప్రథమ చికిత్స కేంద్రం‘ అని మాత్రమే రాసి ఉంటుందని, కానీ లోపల మాత్రం పెద్ద హాస్పిటల్ స్థాయిలో రోగులను చేర్చుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చదివిన చదువుకు, చేసే వైద్యానికి ఎలాంటి పొంతనా లేకపోయినా తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. ఈ అక్రమ నిర్వాహకుల వెనుక ’ఖద్దర్ నేతల’ అండదండలు పుష్కలంగా ఉన్నాయని, రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారులు కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి.
జిల్లా ఉన్నతాధికారులు రావడం, తనిఖీలు చేసి సీజ్ చేయడం.. ఆ తర్వాత వారంలోనే మళ్లీ ఆ క్లినిక్లు తెరుచుకోవడం ఒక ప్రహసనంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. నామమాత్రపు జరిమానాలతో సరిపెట్టకుండా, నిబంధనలు ఉల్లంఘించే నకిలీ వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, శాశ్వతంగా ఈ కేంద్రాలను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల అలసత్వానికి ప్రజల ప్రాణాలు బలికాకముందే స్పందించి తగిన రక్షణ కల్పించాలని హత్నూర, దౌల్తాబాద్, మండలం గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
డీఎంహెచ్‌ఓ లలితా దేవి వివరణ
హత్నూర, దౌల్తాబాద్ మండలంలో ఆర్‌ఎంపీలు మళ్లీ క్లినిక్లు మళ్లీ నడుస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అవసరమైతే మళ్లీ తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంగిస్తున్నారా లేదా అని క్షేత్రస్థాయి తనిఖీల పరిశీలనకు స్థానిక వైద్యాధికారి ఎంవో డాక్టర్ రజనిని ఆదేశించాం. చట్ట విరుద్ధంగా ప్రైవేటు వైద్యం అందిస్తున్నట్లు తేలితే సదరు క్లినిక్లను తక్షణమే సీజ్ చేసి, నిర్దాక్షిణ్యంగా కేసులు నమోదు చేస్తాం. ప్రజారోగ్య భద్రతే మాకు ప్రథమ ప్రాధాన్యం; అర్హత లేని వైద్యంపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు.