ఇందిరమ్మ ఇళ్లు పేదలకా..? పార్టీ నాయకులకా..?
లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలి
అర్హులైన పేదలకు న్యాయం చేయాలి
కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్, వామపక్ష పార్టీల మహాధర్నా
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నేతల ఆగ్రహం
ఖమ్మం,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme)లో అర్హులైన పేదలకు న్యాయం చేయాలని, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా పార్టీల ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్(Khammam District Collectorate) ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాకు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్యక్షత వహించాగా ఈ సందర్భంగా బీఆర్ఎస్, వామపక్ష పార్టీల నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరితే లేదా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే సంక్షేమ పథకాలు అందుతాయన్న ధోరణితో అధికార పార్టీ వ్యవహరిస్తోందని నాయకులు విమర్శించారు. సంక్షేమ పథకాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం సరికాదని, అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాల అమలులో అన్ని వర్గాల అర్హులకు ప్రాధాన్యత కల్పించిందని నాయకులు గుర్తుచేశారు.
గతంలో అనుసరించిన పారదర్శక విధానాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను తప్పనిసరిగా గ్రామసభల ద్వారానే చేపట్టాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత లబ్ధిదారులను గ్రామసభల ద్వారానే ఎంపిక చేయాలని, తక్షణమే ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి. గతంలో ఇందిరా ఆవాస్ యోజన, ఆర్సీహెచ్ పథకాల కింద మంజూరై, బిల్లులు అందక అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లకు వెంటనే బిల్లులు మంజూరు చేయాలి.
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ అధ్యక్షతన బీఆర్ఎస్, వామపక్ష పార్టీల నాయకులు సంయుక్తంగా ర్యాలీగా జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామాల వారీగా అర్హులైన పేద లబ్ధిదారుల వివరాలను, వారి ఫొటోలతో సహా వినతిపత్రానికి జతచేసి అందజేశారు. అర్హత ఉన్నప్పటికీ ఇళ్లు మంజూరు కాని ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ మహాధర్నాలో బీఆర్ఎస్, వామపక్ష పార్టీల నాయకులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అర్హులైన ఇళ్ల లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.