రేహాన్ వాద్రా ఫొటోలపై వివాదం.. బికనేర్ హౌస్ ఏమందంటే?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడు, ఫొటోగ్రాఫర్ రేహాన్ వాద్రా(Raihan Vadra) ప్రదర్శనలోని కొన్ని ఫొటోల తొలగింపు వివాదాస్పదంగా మారింది. ఢిల్లీలోని బికనేర్ హౌస్లో ఏర్పాటు చేసిన ‘నో ఐడియా ఈజ్ ఫైనల్’ ఫొటో ఎగ్జిబిషన్(No Idea Is Final exhibition)లో యువత నిరసనలకు సంబంధించిన చిత్రాలను తొలగించాలని నిర్వాహకులు కోరినట్లు రేహాన్ వెల్లడించారు. మొత్తం 105 ఫొటోల్లో 74 చిత్రాలను తొలగించాలని తనకు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చర్య కళాత్మక వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఆంక్షలు విధించడమేనని అభిప్రాయపడ్డారు.
నిబంధనలకు అనుగుణంగా లేవు: బికనేర్ హౌస్
ఈ వివాదంపై బికనేర్ హౌస్(Bikaner House) యాజమాన్యం స్పందించింది. తొలగించాలని కోరిన ఫొటోలు సంస్థ విధానాలకు అనుగుణంగా లేవని తెలిపింది. కళ, సంస్కృతికి సంబంధించిన ప్రదర్శనలకు వేదిక కల్పిస్తున్న సంస్థలో నిర్వహించే కార్యక్రమాలు నిర్దేశిత నిబంధనలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. ఫొటోల తొలగింపు వ్యవహారంపై ప్రియాంక గాంధీ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ ఘటన కళా స్వేచ్ఛ, రాజకీయ సందేశాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంస్కృతిక వేదికల నిబంధనలపై చర్చకు దారితీసింది.