జ్వరంతో విషాదాంతం!
సింగరేణి, అక్టోబర్ 3 (విజయక్రాంతి): మండల పరిధిలోని చండ్రలగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ధనసరి విజయ జ్వరంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైరా మాజీ ఆత్మ కమిటీ చైర్మన్, మాజీ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, మాజీ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీరా వీరన్న.. విజయ పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ పీఈటీగా(Contract PET) విధులు నిర్వహిస్తున్న విజయ జ్వరంతో మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. ఆమె కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
విజయ సోదరుడు ధనసరి రాంబాబు మాట్లాడుతూ.. చదువుతో పాటు ఆటలంటే విజయకు ఎంతో ఇష్టమని తెలిపారు. కుటుంబానికి ఆమె పెద్దదిక్కుగా ఉండేదని.. ఆమె మృతి తమ కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. విజయకు నివాళులర్పించిన వారిలో స్థానికులు భూక్యా హరియా నాయక్, దల్‌సింగ్, మూలకం వెంకన్న, గూగులోత్ శ్రీను, ధరావత్ రవి, అజ్మీరా ప్రసాద్, సమ్మయ్య, కొటేష్, పోతురాజు, శివ, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.