నవరాత్రి ఉత్సవాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ఆసిఫాబాద్, అక్టోబర్ 10 (విజయ క్రాంతి): దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ సూచించారు. విగ్రహ ప్రతిష్ఠాపన కోసం మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (Online Registration) చేసుకొని, పోలీసుల అనుమతులు పొందాలని స్పష్టం చేశారు.
మండపాల వద్ద సీసీ కెమెరాలు (CCTV Cameras) ఏర్పాటు చేయాలని, విద్యుత్, అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రహదారులు, కాలిబాటలకు అడ్డంకులు కలిగించరాదని, డీజే సౌండ్ వినియోగించకూడదని తెలిపారు. ఇతర మతాల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పాటలు ప్రసారం చేయరాదని పేర్కొన్నారు. భద్రత కోసం వాలంటీర్లను నియమించి, వారి వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్‌లో అందజేయాలని సూచించారు.
సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, నిర్ధారణ కాని వార్తలు, వీడియోలను ఫార్వర్డ్ చేయరాదని ఎస్పీ కోరారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం వెబ్‌సైట్: https://policeportal.tspolice.gov.in