జీవో 59కు గ్రీన్‌సిగ్నల్
- 500 గజాల్లోపు ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ
- నెలరోజుల్లో దరఖాస్తుల పరిష్కారం
- 22 ఏపై సీఎం హామీలు ఒక్కొక్కటిగా అమలు
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఇచ్చిన హామీ మేరకు 22 ఏ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవె న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి( Minister Ponguleti Srinivas Reddy ) తెలిపారు. జీవో ఎంఎస్. నెం.59 కింద 500 చదరపు గజాలు, అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ పెం డింగ్ దరఖాస్తులను నెల రోజుల్లోగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.
ఈ మేరకు కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. గతంలో జారీ చేసిన జీవో నెం బర్లు 14, 22, 29, 41 అనుగుణంగా మెమో నెంబర్ 48030ను జారీ చేశామని మంత్రి తెలిపారు. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుతో కలిపి ఇప్పటి వరకు మొత్తం ఏడు కీలక ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసిందన్నారు. దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి అక్రమాలు జరిగినా, నిబంధనల ఉల్లంఘనలు జరిగినా సహించేది లేదని వెల్లడించారు.
శుక్రవారం సచివాలయంలో ఉన్నతధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. జీవో 59 పరిధిలోని ఆస్తుల విషయంలో అసలు భూమి, లబ్ధిదారుల అర్హత, విస్తీర్ణం తదితర అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి క్రమబద్ధీకరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని, పొరపాట్లకు తావుండరాదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని అక్రమాలు జరిగినట్టు తమ దృష్టికి రావడంతో జీవో 59 అమలును ప్రభుత్వం నిలిపివేసిందని, తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇప్పటికే పరిష్కరించబడిన కన్వేయన్స్ డీడ్స్ కేసులను కూడా పరిశీలించాలన్నారు. గతంలో జీవో 59 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటం వల్ల చిన్నచిన్న ఇండ్ల స్థలాలు, ఆస్తులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం సామాన్య ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. 22ఏతో ముడిపడి ఉన్న 10 నుంచి 12 సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
జీవో118, జీవో 76లకు అనుగుణంగా స్పష్టమైన మెమోలను జారీ చేశామని మంత్రి వివరించారు. సమావేశంలో రెవెన్యూ సెక్రటరీ డిఎస్ లోకేష్‌కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్, ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.