ఎవ్వరెక్కువ కాదు..
- రాజ్యాంగాన్ని ధిక్కరించే హక్కు ఎవరికీ లేదు
- జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే వైదొలగాలి
- సర్‌లో స్పందించాలి
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : భారత రాజ్యాంగం(Indian Constitution) కంటే గొప్ప దేదీ లేదని, ఈ దేశంలో ఏ ఒక్క పౌరుడి ఓటు హక్కునూ లాక్కునే అధికారం ఎవరికీ లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పష్టం చేశారు. వ్యవస్థల కంటే వ్యక్తులు ఎన్నడూ గొప్పవారు కారని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే తన బాధ్యతల నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు.
‘ఈ దేశం ఎందరో వ్యక్తులను చూసింది, ఎందరో వచ్చారు.. పోయారు. వాటన్నింటినీ తట్టుకుని భారతదేశం ఎంతో బలంగా నిలబడింది, సగర్వంగా ముందుకు సాగుతోంది. అలాంటిది వ్యవస్థలను పక్కనపెట్టి, ఒక్క వ్యక్తిని కాపాడటానికి ఇంతటి తాపత్రయం ఎందుకు?’ అని కేటీఆర్ నిలదీశారు. 140 కోట్ల మంది భారతీయుల ప్రాథమిక హక్కుల కంటే ఆ ఒక్క వ్యక్తి ఎలా గొప్పవాడయ్యాడని ప్రశ్నించారు.
భారతదేశపు మూల సిద్ధాంతాలను, ఆత్మను తుంగలో తొక్కుతూ సమాంతర వ్యవస్థలను నిర్మించాలని చూసేవారికి కాలం చెల్లిందని హెచ్చరించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియలో జరిగిన తీవ్ర అక్రమాలు, అవకతవకలపై భారత అత్యున్నత న్యాయస్థానం స్పందించాలని కోరారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి, సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని బీఆర్‌ఎస్ తరఫున కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.