గ్రీన్ ఎనర్జీ విప్లవం.. గ్రిడ్‌కు 2 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్

22-10-2026 | 10:50am

బెజ్జూరు, అక్టోబర్ 21 (విజయక్రాంతి): బెజ్జూరు 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 2 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను (Solar Power Plant) ఎస్‌ఈ ఆపరేషన్స్ ఆసిఫాబాద్ ఉత్తమ్ జాడే సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ ఉత్తమ్ జాడే మాట్లాడుతూ, సౌర విద్యుత్ ప్లాంట్ల ద్వారా స్థానిక విద్యుత్ అవసరాలకు తోడ్పాటు లభించడంతో పాటు విద్యుత్ లోడ్‌పై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. గ్రిడ్ ఫ్రీక్వెన్సీ స్థిరత్వాన్ని (Grid Frequency Stability) నిర్వహించడంలోనూ ఇవి సహాయపడతాయని వివరించారు.

అనంతరం ఆయన గూడ్లబోరి గ్రామంలోని వ్యవసాయ పొలాలను సందర్శించి, రైతులతో మాట్లాడారు. సిబ్బందితో కలిసి వ్యవసాయ పంపుసెట్ల పనితీరును పరిశీలించారు. విద్యుత్ మోటార్లకు తగిన కెపాసిటర్లను అమర్చుకోవడం ద్వారా పవర్ ఫ్యాక్టర్ మెరుగుపడి, వోల్టేజ్ స్థిరత్వానికి (Voltage Stability) తోడ్పడుతుందని రైతులకు వివరించారు. కెపాసిటర్ల వినియోగంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ‘పొలం బాట’ కార్యక్రమాన్ని నిర్వహించి, రైతులకు విద్యుత్ వినియోగం, పంపుసెట్ల నిర్వహణపై సూచనలు చేశారు.

అలాగే గూడ్లబోరి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ పనులను పరిశీలించారు. నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. నూతన సబ్‌స్టేషన్ పనులను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరచడం, రైతులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడం, ప్రాంతంలో విద్యుత్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏడీఈ ఇర్ఫాన్ అహ్మద్, సంతోష్, సబ్‌ఇంజినీర్ అజయ్, సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్ ధర్మయ్య, లైన్ ఇన్‌స్పెక్టర్లు మదన్, మల్లేష్, శ్యామ్‌రావు, సిబ్బంది శీను, దుర్గం శంకర్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు