తిప్పికొడతాం
- ఇండీ కూటమి ప్రచారంపై రేపటి నుంచి దేశవ్యాప్తంగా బీజేపీ కార్యక్రమాలు
- బీజేపీ నేత, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్
హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ఇండీ కూటమి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత డాక్టర్ కే లక్ష్మణ్(BJP leader Dr. K. Laxman) స్పష్టం చేశారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేతృత్వంలో జరుగుతున్న నిరసనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని విమర్శించారు.
న్యాయస్థానాలు, రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా తప్పు డు ప్రచారం చేస్తూ, దేశంలో అరాచకత్వానికి తెరలేపుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్ గాంధీపై మండిపడ్డారు. బుధవారం మీడియాతో లక్ష్మణ్ మాట్లాడుతూ.. అధికారం సాధించడమే లక్ష్యంగా, దేశ ప్రయోజనాలను సైతం పట్టించుకోని ధోరణిలో రాహు ల్‌గాంధీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ సంస్థలపై ప్రజల్లో అనుమానాలు కలిగించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై విశ్వాసాన్ని దెబ్బతీసేలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఇండీ కూటమి చేస్తున్న ప్రచారానికి ప్రజల్లో వాస్తవాలను వివరించేందుకు బీజేపీ దేశవ్యాప్త కార్యాచరణకు సిద్ధమైందని తెలిపారు.
ఇందులో భాగంగా అక్టోబర్ 23 నుంచి నవంబర్ 5 వరకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విపక్షాల ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లి తిప్పికొట్టడంతో పాటు, వాస్తవ పరిస్థితులను వివరించడమే ఈ కార్యక్రమాల ఉద్దేశమని పేర్కొన్నారు. ఇండీ కూటమి ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.