ఫ్యూచర్ కు చిక్కులు!
ఫార్మాసిటీ భూములే భారత్ ఫ్యూచర్ సిటీకి కేటాయింపు
- రైతుల అనుమతి తీసుకోకుండానే ముందుకు
- న్యాయపరమైన ఇబ్బందులు తప్పవంటున్న నిపుణులు
- అయోమయంలో పెట్టుబడిదారులు
- బ్యాంకు రుణాలపైనా గందరగోళం
- భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే..
హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ‘ఫ్యూచర్’కు భూ చిక్కులు తప్పేలా లేవు!. భారత్ ఫ్యూచర్ సిటీ(India's Future City) పేరుతో ఫార్మాసిటీ భూములను పెట్టుబడిదారులకు కేటాయించడంపై న్యాయవివాదాలు తలెత్తే అవకాశలున్నాయన్న నిపుణుల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే భూ సేకరణ, కేటాయింపులపై వివాదాలు నెలకొనగా,
వాటిని పరిష్కరించకుండా ప్రభుత్వం ముందుకెళ్తుండటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడి పెట్టడానికి ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది.వెరసి ఫ్యూచర్ సిటీ ఏర్పాటులో నెలకొన్న సమస్యలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో న్యాయపరమైన చిక్కులను తొలగించి, పెట్టుబడిదారులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
ఫార్మాసిటీ పేరు.. ఫ్యూచర్ సిటీ ఊరు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో సుమారు 30 వేల ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. భూసేకరణ ప్రక్రియ మధ్యలో ఉండగానే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. పార్టీ పాలసీలకు అనుగుణంగా సీఎం రేవంత్రెడ్డి భారత్ ఫ్యూచర్ సిటీని తెరపైకి తీసుకొచ్చారు. సుమారు 40 వేల ఎకరాలతో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తామని, ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పారు.
కానీ, ఇప్పటి వరకు ఫార్మాసిటీని రద్దు చేయలేదు. దీనిపై న్యాయపరమైన వివాదాలకు సంబంధించిన అంశం హైకోర్టులో కొనసాగుతోంది. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములనే ఫ్యూచర్ సిటీకి కేటాయించడంపై వివాదం మరింత రాజుకుంది. వాస్తవానికి చట్టప్రకారం.. ఒక అవసరానికి సేకరించిన భూములను ఇతర అవసరాలకు మళ్లించకూడదు.
కానీ, ఇవేమీ పట్టించుకోకుండానే రైతుల నుంచి ఫార్మాసిటీకి సేకరించిన భూములను ఫ్యూచర్ సిటీకి కేటాయించడం.. సమస్యను మరింత జఠిలం చేస్తోంది. ఈ అంశం ఎప్పటికైనా ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు.
రైతుల నుంచి ముందస్తు అనుమతులు ఏవీ?
ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ఫ్యూచర్ సిటీకి వాడుకోవాలంటే పెద్ద ప్రక్రియనే ఉంటుంది. ముందుగా ఫ్యూచర్ సిటీ భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. అలాగే ఎలాంటి అభ్యంతరం లేదని రైతుల నుంచి రాతపూర్వకంగా ధ్రువీకరణ పత్రాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండానే ఫ్యూచర్ సిటీలో పెట్టుబడిదారులకు ప్రభుత్వం భూములు కేటాయిస్తోంది.
ఇవన్నీ బూమరాంగ్ అవుతాయని (భవిష్యత్తులో ప్రతికూలంగా మారే అవకాశం), న్యాయవివాదాలు తలెత్తకమానదని, కోర్టుల్లో ప్రభుత్వ కేటాయింపులు నిలబడవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెట్టుబడిదారుల్లో గుబులు!
ప్రభుత్వం అనేక సానుకూల అంశాలను చూపి ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రోత్సహిస్తోంది. అయితే పెట్టుబడిదారుల్లో మాత్రం తెలియని ఆందోళన నెలకొంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాబోయేది తమ ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ కుండబద్ధలు కొట్టి చెబుతున్నారు.
ఒకవేళ ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన పెట్టుబడిదారుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మారితే తమ పెట్టుబడి న్యాయవివాదాల్లో చిక్కుకుంటుందని, తద్వారా ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయనే భయం వారిని వెంటాడుతోంది. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఆచితూచి అడుగులు వేసే పరిస్థితి కనపడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్టుబడి పెట్టి, కంపెనీలు నిర్మించిన తర్వాత న్యాయవివాదాలు తలెత్తితే తమ పరిస్థితి ఏమిటనే మీమాంసలో పెట్టుబడిదారులు ఉన్నట్లు తెలుస్తోంది.
రుణాల మాటేంటి?
కంపెనీలకు బ్యాంకుల నుంచి ఇచ్చే రుణాలపైకూడా అదేస్థాయి అయోమయం నెలకొంది. ఫ్యూచర్ సిటీకి చట్టబద్ధత విషయంలోనే అనేక అనుమానాలు వ్యక్తమవుతుండటం, మరో వైపు న్యాయవివాదాలకు సంబంధించి హైకోర్టు ఉన్నందున, రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు కొర్రీలు పెట్టే అవకాశం లేకపోలేదు. అటువంటి పరిస్థితి రాకుండా చట్టబద్ధంగా అన్నీ పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
భరోసా తప్పనిసరి
అటు రైతుల నుంచి మొదలుకుని.. ఇటు ఇన్వెస్టర్ల వరకు, బ్యాంకుల నుంచి మొదలుకుని.. న్యాయస్థానాల వరకు ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇన్వెస్టర్లకు భరోసా కల్పిస్తే.. ఫ్యూచర్ సిటీలో అడుగుపెట్టేందుకు వారు ఉత్సాహంగా ముందుకు వస్తారని పేర్కొంటు న్నారు.
వీటితోపాటు రాజకీయ సమస్యలు తలెత్తకుండా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అనుమానాలు, సందేహాలకు తావులేకుండా ప్రభుత్వం తరఫున న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
పార్టీల ప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. ఇన్వెస్టర్లలో భరోసా కల్పిస్తే వారిలో సందేహాలు, భయం తొలగిపోయి, హైదరాబాద్కు నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీ నిలుస్తుందని ఆయా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.