రహదారి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి

30-09-2026 | 10:06pm

జిల్లా కలెక్టర్ కె.హరిత

ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): జిల్లాలో రహదారి ప్రమాదాలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ కె.హరిత(Collector K. Haritha ) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా ఎస్.పి. నితికా పంత్, జిల్లా అదనపు కలెక్టర్  యువరాజ్ మర్మాట్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్ రావు లతో కలిసి రహదారి భద్రత, ప్రమాదాల నివారణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని, రహదారులపై పశువుల సంచారం లేకుండా పశువుల యజమానులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రధాన రహదారులు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాలలో పశువులు, కుక్కలు వాహనాలకు అడ్డం రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఈ అంశంపై దృష్టి సారించాలని తెలిపారు.

రహదారులు భవనాలు, పంచాయితీ రాజు రహదారులపై గుంతల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని, కళాశాలలు, పాఠశాలలలో రహదారి నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆటో డ్రైవర్లు, వాహన డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపకుండా, ప్రతి వాహనదారుడు హెల్మెట్/ సీట్ బెల్ట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడుపకుండా తనిఖీలు చేపట్టాలని, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయాలని తెలిపారు.

ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించే విధంగా అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని, రహదారి ప్రమాదాలు జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, కాగజ్ నగర్ డి ఎస్ పి లు అశోక్, వహిదుద్దీన్, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈ.ఈ. ధర్మేందర్, జిల్లా రవాణా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు