ఎస్సీ వర్గీకరణ రోస్టర్‌పై మాలల ఆగ్రహం
- మాల సంఘాల నాయకుల ముందస్తు అరెస్టులు
కోనరావుపేట,(విజయక్రాంతి): తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ(SC classification), ఉద్యోగ నియామకాల రోస్టర్ విధానం(Roster System)లో మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని మాల సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లలోని రోస్టర్ పాయింట్లలో మాలలకు సున్నా లేదా చాలా తక్కువ సంఖ్యలో పోస్టులు కేటాయించారని వారు ఆరోపించారు.
రోస్టర్ విధానాన్ని సవరించాలని, వివాదాస్పదంగా పేర్కొంటున్న జీవో 99ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మాల సంఘాలు, నిరుద్యోగ యువత నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆందోళనలు తీవ్రతరం కాకుండా పోలీసులు కోనరావుపేట మండలంలోని మాల సంఘాల నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేశారు.ఈ సందర్భంగా అరెస్టయిన వారిలో మాలల ఐక్యవేదిక మండల ఉపాధ్యక్షుడు మదాసు భూమయ్య, కార్యదర్శి కూలేరు బాబు, సహాయ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, జంగిలి కిషన్ ఉన్నారు. రోస్టర్ విధానంలో తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.