స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

09-10-2026 | 12:23pm

ఆరు వారాల్లో నోటిఫికేషన్.. ఏపీ స్థానిక ఎన్నికల్లో బిగ్ అప్‌డేట్!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎన్నికల నోటిఫికేషన్, ఓటర్ల జాబితాపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్దేశించిన గడువులోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆరు వారాల్లోపు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమని వెల్లడించింది. దీంతో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు, ఎన్నికల షెడ్యూల్‌పై ఆసక్తి పెరిగింది.

ఓటర్ల జాబితాకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. నోటిఫికేషన్ విడుదలయ్యేలోపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పూర్తయితే, సవరించిన ఓటర్ల జాబితాను ఉపయోగించాలని సూచించింది. ఒకవేళ ఆ ప్రక్రియ అప్పటికి పూర్తికాకపోతే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాత ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో ఓటర్ల జాబితా సవరణ పూర్తయ్యే వరకు ఎన్నికలను వాయిదా వేయాలన్న అంశంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది? ఎన్నికల షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అన్న అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ఎన్నికల తేదీలు, దశలవారీ షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు