నేడు ఆర్టీసీ పోరు

09-10-2026 | 05:30am
  1. పదేళ్ల తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు
  2. బరిలో 12 యూనియన్లు.. 30వేల మంది ఓటర్లు    
  3. రెండు ఓట్లతో తేలనున్న రాష్ట్ర, ప్రాంతీయ సంఘాల భవితవ్యం 
  4. వేతన బకాయిలు, పీఆర్సీ, డీఏలే ప్రధాన ఎజెండా
  5. ఉద్యోగ భద్రత, ఖాళీల భర్తీపై ఉద్యోగుల ఫోకస్   
  6. ఉదయం 5గంటలకు పోలింగ్ ప్రారంభం

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(Telangana State Road Transport Corporation)లో ‘గుర్తింపు’పోరుకు సర్వం సిద్ధమైంది. పదేళ్ల సుదీర్ఘ విరామం త ర్వాత శుక్రవారం కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరగనున్నాయి. సుమారు 39 వేల మంది ఉద్యోగులు రహస్య బ్యాలెట్ ద్వారా ‘డబుల్’ తీర్పు ఇవ్వబోతున్నారు.

12 కార్మిక సంఘాలు బరిలో నిలవగా.. ఉద్యోగుల సమస్యలపై ఎవరు తమ గళాన్ని బలంగా వినిస్తారు? ఎవరు పోరాడుతారు? అనే అంశాలే కీలకంగా మారాయి. ఆర్టీసీలో చివరిసారిగా 2016 జూలైలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల పదేళ్ల పాటు కార్మిక సంఘాలు ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో వీటికి ప్రాధాన్యం ఏర్పడిం ది. ఈ పదేళ్ల కాలంలో సంస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. పాత ఉద్యోగుల్లో వందలాది మంది పదవీ విరమణ చేయగా.. మరికొందరు పదోన్నతులు పొందారు.

మరోవైపు 2016 తర్వాత ఆర్టీసీలో చేరిన కొత్త ఉద్యోగులు భారీ సంఖ్య లోనే ఉన్నారు. దీంతో అప్పటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు సమీకఱనలు పూర్తిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో సుమారు 39 వేల మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఒక్కో ఓటరు రెండు ఓట్లు వేయనున్నారు. ఒక ఓటు రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘానికి, మరొకటి ప్రాంతీయ స్థాయి యూనియన్ గుర్తింపు కోసం వినియోగించనున్నారు.  

మూడు కూటములు.. మారిన సమీకరణాలు

ఎన్నికల్లో పలు కార్మిక సంఘాలు కూటములుగా ఏర్పడి ప్రచారం నిర్వహించాయి. ఈయూ, టీఎంయూ, ఎన్‌ఎంయూ ఒక కూటమిగా.. టీడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎస్‌ఈబ్ల్యూయూ మరో కూటమిగా బరిలోకి దిగాయి. మిగతా సంఘాలు స్వతంత్రంగా పోటీ చేస్తున్నాయి. రాజకీయ పార్టీల మద్ద తు, ఆయా పార్టీలకు ఉన్న అనుబంధాలు కూడా ప్రచారంలో చర్చనీయాంశంగా మా రాయి. ముఖ్యంగా టీడబ్ల్యూయూ కూటమి ‘బాణం’ గుర్తుతో విస్తృతంగా ప్రచారం చేసింది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను చెల్లించడం, ఉద్యోగ భద్రత కల్పించడం, సంస్థను పరిరక్షించడం, ప్రైవేటీకరణను అడ్డుకోవడం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. విద్యుత్ బస్సులను సంస్థే కొనుగోలు చేయాలని, నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేసింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు ఈ ఎన్నికల్లో కీలక అజెండాగా మారాయి. 2025 వేతన సవరణతో పాటు 2017, 2021 వేతన సవరణ బకాయిల చెల్లింపు, పీఆర్సీ, డీఏలు, బోనస్‌లు, పీఎఫ్, సీసీఎస్ బకాయిలు, పెన్ష న్ వంటి ఆర్థిక అంశాలపై ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది. అదే సమయంలో సిబ్బంది కొరత, పెరిగిన పనిభారం, ఖాళీల భర్తీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమం వంటి అంశాలు కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. 

కీలకంగా కొత్త ఓటర్లు

కొత్తగా చేరిన ఉద్యోగుల ఓట్లు ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. 2016 తర్వాత ఆర్టీసీలో చేరిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉండటంతో వారి సమస్యలు, ఆలోచనలు, ప్రాధాన్యతలు పాత తరం ఉద్యోగుల కంటే భిన్నంగా ఉండే అవకాశం ఉంది. పాత యూనియన్ నాయకత్వంలో ఉన్న పలువురు పదవీ విరమణ చేయడం, పదోన్న తులు పొందడం కూడా ఎన్నికల సమీకరణాలను మార్చింది. దీంతో ఈసారి పాత యూనియన్ల ప్రభావం ఎంతవరకు కొనసాగుతుంది? కొత్త ఉద్యోగులు ఎటువైపు మొగ్గుతారు? స్థానికంగా కార్మికుల సమస్యలపై ఎవరు అందుబాటులో ఉంటారనే అంశాలు ఫలితాలను ప్రభావితం చేసే అవకాశముంది.

పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో యూనియన్లకు ఉద్యోగులు ఇచ్చే తీర్పు ఆర్టీసీలో భవిష్యత్ కార్మిక రాజకీయాలకు దిశానిర్దేశం చేయనుంది. ప్రచారంలో సంఘాలు ఇచ్చిన హామీలు, తమ సమస్యలపై పోరాటం చేస్తామన్న హామీలను ఉద్యో గులు ఎంతవరకు విశ్వసించారన్నది నేడు జరిగే పోలింగ్‌తో తేలనుంది. దాదాపు 20 రోజుల పాటు హోరాహోరీగా ప్రచారం సా గించిన కార్మిక సంఘాలు.. పోలింగ్‌పై దృష్టి సారించాయి. ఉద్యోగులు ఏ సంఘానికి పట్టం కడతారన్న ఉత్కంఠ ఆర్టీసీ వర్గాల్లో నెలకొంది.    

ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్

శుక్రవారం ఉదయం 5 గంటలకు పోలిం గ్ మొదలై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.ఈ నెల 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించనున్నారు. 17న ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. ఎన్నికల నిర్వహణకు ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది.

మరిన్ని వార్తలు