TGPSC ఎదుట నిరసన

17-10-2026 | 01:43pm

ఒకే రోజు రెండు పరీక్షలు.. నిరుద్యోగులకు మరో షాక్! TGPSC ఎదుట నిరసన

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు పరీక్షల తేదీలు కొత్త సమస్యగా మారాయి. రోడ్లు, భవనాల శాఖలోని Assistant Executive Engineer (R&B AEE) పరీక్ష, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే Staff Selection Commission Junior Engineer (SSC JE) పరీక్ష రెండూ నవంబర్ 6, 2026న నిర్వహించనున్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. ఒకే రోజున రెండు కీలక పరీక్షలు ఉండటంతో ఏ పరీక్షకు హాజరుకావాలో నిర్ణయించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో AEE పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.

ఒకే తేదీతో అభ్యర్థులకు ఇబ్బందులు

ప్రభుత్వ ఉద్యోగాల కోసం నెలల తరబడి సిద్ధమవుతున్న అభ్యర్థులకు పరీక్షల తేదీల క్లాష్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ ఖాళీలు ఇప్పటికే పరిమితంగా ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో రెండు పరీక్షలు ఒకే రోజు నిర్వహిస్తే అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా Civil Engineering విద్యార్హత ఉన్నవారు రెండు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారని, పరీక్షల సమయాలు ఒకే తేదీకి రావడం తమకు నష్టమని అంటున్నారు. AEE పరీక్షను వాయిదా వేయాలని గత పది రోజులుగా TGPSC కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ తమ సమస్యకు పరిష్కారం లభించలేదని నిరసనకారులు ఆరోపించారు. పరీక్ష తేదీని మార్చాలని పలుమార్లు కోరినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కమిషన్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

AEE పరీక్ష వాయిదా పడుతుందా?

నవంబర్ 6న నిర్వహించనున్న R&B AEE పరీక్ష తేదీని మార్చాలన్నది నిరుద్యోగుల ప్రధాన డిమాండ్. పరీక్షల మధ్య తేదీల ఘర్షణ లేకుండా అధికారులు ప్రత్యామ్నాయం పరిశీలించాలని కోరుతున్నారు. అయితే పరీక్ష వాయిదా పడిందా, తేదీలో మార్పు ఉంటుందా అనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడే వరకు అభ్యర్థులు TGPSC తాజా నోటిఫికేషన్లను పరిశీలించాలి. నిరుద్యోగుల ఆందోళనపై కమిషన్ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అక్టోబర్ 26: TGPSC PCB AEE (నోటిఫికేషన్ 02/OG/PC/2026) & AAI మేనేజర్ (సివిల్ - Advt 12/2026) పరీక్షలు ఒకే రోజున షెడ్యూల్ అయ్యాయి. 

అక్టోబర్ 27–28: వెనువెంటనే RRB JE CBT-1 (CEN 04/2026) పరీక్షలు ప్రారంభం కానుండటంతో ప్రయాణం, ప్రిపరేషన్ అభ్యర్థులకు తీవ్ర భారంగా మారింది. 

నవంబర్ 6 & 7: TGPSC AEE (R&B) పరీక్షలు, అదే సమయంలో సెంట్రల్ లెవల్ SSC JE పరీక్షలు ఉండటం వల్ల సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు మరో తీవ్ర ఎదురుదెబ్బ తగలనుంది.

పరీక్షా క్యాలెండర్ ఖరారు చేసేటప్పుడు ఇతర జాతీయ స్థాయి పరీక్షల తేదీలను పరిగణనలోకి తీసుకొని ముందుచూపుతో వ్యవహరించాలి. 

ఏళ్ల తరబడి శ్రమించి సిద్ధమైన యువత.. ఒక అవకాశం కోసం మరో అవకాశాన్ని వదులుకునే దుస్థితి తేవద్దు!

తెలంగాణ నిరుద్యోగ ఇంజనీరింగ్ అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, బేషజాలకు పోకుండా క్లాష్ అవుతున్న TGPSC PCB-AEE మరియు R&B-AEE పరీక్షలను వెంటనే రీషెడ్యూల్ చేసి, తగిన వ్యవధితో కొత్త తేదీలను ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం!

మరిన్ని వార్తలు