యాసంగిలో ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి

24-10-2026 | 04:46pm

మంచిర్యాల ఏడీఏ క్రిష్ణ 

హాజీపూర్, (విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావం(impact of El Nino) తీవ్రంగా ఉన్న నేపథ్యంలో యాసంగి సీజన్ లో రైతులు(Farmers) ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంచిర్యాల(Mancherial) ADA మామిడి క్రిష్ణ కోరారు. శని వారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని పెద్దంపేట్ లో కేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, భూగర్భ జలాలపై(Groundwater) ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున, రాబోయే యాసంగి సీజన్‌లో వరి పంట(Paddy crop) బదులుగా రైతులు నీటి వినియోగాన్ని తగ్గించే ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వరి పంటకు అవసరమయ్యే నీటితో పోలిస్తే ఆరుతడి పంటలకు తక్కువ నీరు అవసరమవుతుందన్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, జొన్న, పెసర, మినుము, కుసుమ, నువ్వులు వంటి పంటలను సాగు చేయడం ద్వారా తక్కువ నీటితో సాగు చేయవచ్చన్నారు.

వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు సాగు విధానాల్లో మార్పులు చేసుకోవడం అత్యవసరమని, నీటి పొదుపు, నేల సంరక్షణ, పంట వైవిధ్యీకరణ ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చనీ సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో దోనబండ గ్రామ సర్పంచ్ జాడి వెంకటేష్, ఆత్మ డైరెక్టర్ రవి గౌడ్, హాజీపూర్ AO క్రిష్ణ, AEO కొమురయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు