పెడ్లర్లపై నిరంతర నిఘా..

29-10-2026 | 04:17pm
  1. సరఫరా వ్యవస్థ మూలాలను గుర్తించి ఛేదించాలి...
  2. ఈగిల్ టీమ్ ఎస్పీ గిరిధర్
  3. గంజాయి, మాదకద్రవ్య రహిత కమిషనరేట్‌గా రామగుండం
  4. డ్రగ్స్ సరఫరా మూలాలను సమూలంగా ఛేదించాలి
  5. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): గంజాయి, ఇతర మాదకద్రవ్యాల సరఫరా, విక్రయాలను అరికట్టేందుకు సరఫరా చేసే పెడ్లర్లపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు, వారికి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న మూలాలను గుర్తించి మొత్తం సరఫరా వ్యవస్థను ఛేదించాలని తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఈగిల్ టీమ్) ఎస్పీ గిరిధర్ పోలీస్ అధికారులను ఆదేశించారు.

గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) కేసులపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో రామగుండం కమిషనరేట్ పరిధిలోనీ మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో నమోదైన NDPS కేసుల పురోగతి, పెండింగ్ కేసులు, దర్యాప్తు స్థితిగతులు, నిందితుల కార్యకలాపాలు, గంజాయి సరఫరా మార్గాలు తదితర అంశాలను ఎస్పీ గిరిధర్ సమగ్రంగా సమీక్షించారు.

పెండింగ్‌లో ఉన్న కేసులకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో దర్యాప్తు పురోగతిని పరిశీలిస్తూ, కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు, సాక్ష్యాధారాల సేకరణ, నిందితుల గుర్తింపు, సరఫరా మూలాల అన్వేషణ తదితర అంశాల్లో దర్యాప్తు అధికారులు వృత్తిపరమైన నైపుణ్యంతో వ్యవహరించాలని సూచించారు.

సరఫరా గొలుసును ఛేదించడమే లక్ష్యంగా...

గంజాయి విక్రయించే వ్యక్తులను మాత్రమే గుర్తించి కేసులు నమోదు చేయడం కాకుండా, వారికి గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరు సరఫరా చేస్తున్నారు, ఏ మార్గాల్లో రవాణా చేస్తున్నారు అనే అంశాలపై లోతైన దర్యాప్తు చేపట్టాలని ఈగల్ టీమ్ ఎస్పీ గిరిధర్ సూచించారు.

గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా గొలుసులోని ప్రతి స్థాయిని గుర్తించి, పెడ్లర్ల నుంచి ప్రధాన సరఫరాదారుల వరకు మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదించే విధంగా సమన్వయంతో దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగించాలని, అనుమానాస్పద వ్యక్తులు, ప్రదేశాలు, సరఫరా మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

మాదకద్రవ్య రహిత కమిషనరేట్‌గా రామగుండం - సీపీ అంబర్ కిషోర్ ఝా 

రామగుండం పోలీస్ కమిషనరేట్‌ను మాదకద్రవ్య రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ విక్రయాలు, నిల్వలు, రవాణాపై నిరంతరం సమాచార వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని చెప్పారు. మాదకద్రవ్యాల కేసుల్లో దర్యాప్తు అధికారులు వృత్తిపరమైన నైపుణ్యంతో, చట్టపరమైన విధానాలను ఖచ్చితంగా పాటిస్తూ దర్యాప్తు చేపట్టాలని సూచించారు.

NDPS చట్టం నిబంధనల ప్రకారం నిందితులు అక్రమంగా సంపాదించిన ఆస్తులను గుర్తించి, చట్టపరమైన ప్రక్రియను అనుసరించి ప్రాపర్టీ సీజ్/ఫ్రీజ్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిందితులకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న ప్రధాన వ్యక్తులు, సరఫరా మార్గాలు, ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై దృష్టి సారించి దర్యాప్తును విస్తరించాలని సూచించారు.

మాదకద్రవ్యాల నిర్మూలన కేవలం కేసులు నమోదు చేయడంతో పూర్తికాదని, సరఫరా మూలాలను ఛేదించడం, వినియోగదారులను గుర్తించి కౌన్సెలింగ్ అందించడం, యువతను అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్యపరచడం వంటి బహుముఖ చర్యలు అవసరమని కమిషనర్ తెలిపారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటం, మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, డ్రగ్స్ సరఫరా వ్యవస్థను సమూలంగా నిర్మూలించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను సాధించాలి...

వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సీపీ అంబర్ కిషోర్ ఝా, ఈగల్ టీమ్ ఎస్పీ గిరిధర్ సూచించారు. కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో గంజాయికి అలవాటుపడిన 55 మంది యువతకు కౌన్సెలింగ్ సందర్భంగా పలు సూచనలు చేశారు.

యువత తమలో ఉన్న శక్తి, సామర్థ్యాలను సానుకూల దిశలో వినియోగించుకుని జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ఒత్తిడి, చెడు స్నేహాలు, తాత్కాలిక ఆకర్షణల కారణంగా మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వారు వాటికి పూర్తిగా దూరమై, అవసరమైన సందర్భంలో పునరావాస సహాయాన్ని పొందుతూ కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్నారు.

మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు కుటుంబంపై, విద్యపై, ఉపాధిపై, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే బాధ్యత యువతపై ఉందని గుర్తుచేశారు.

విద్య, సాంకేతిక నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించి, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.

సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని, అవసరమైన యువతకు ప్రత్యేక బృందాల ద్వారా నిరంతర సహాయం, మార్గదర్శకత్వం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు...

NDPS కేసుల దర్యాప్తులో పోలీస్ స్టేషన్ల అధికారులు, టాస్క్‌ఫోర్స్, ఈగల్ టీమ్ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సీపీ అంబర్ కిషోర్ ఝా, ఈగల్ టీమ్ ఎస్పీ గిరిధర్ లు సూచించారు. మాదకద్రవ్యాల సరఫరా, రవాణా, విక్రయాలపై అందే సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించి, సంబంధిత నెట్‌వర్క్‌పై ఏకకాలంలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మాదకద్రవ్యాలపై ప్రజల నుంచి వచ్చే సమాచారాన్ని ప్రాధాన్యతతో పరిశీలించి, సమాచార దాతల వివరాలను గోప్యంగా ఉంచుతూ చట్టపరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, జైపూర్ ఏసీపీ ఆర్. వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి కిరణ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్, ఈగల్ ఫోర్స్ కరీంనగర్ ఆర్‌ఎన్‌సీసీ డీఎస్పీ ఎస్.ఉపేందర్, నిజామాబాద్ ఆర్‌ఎన్‌సీసీ డీఎస్పీ సోమనాథ్, హైదరాబాద్ ఆర్‌ఎన్‌సీసీ డీఎస్పీ పుష్పకుమార్, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు