దళారులను నమ్మి మోసపోవద్దు..
- ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మండి!
- ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం..
- మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ
- తూకం, గన్నీ బ్యాగులు, రవాణాలో ఇబ్బందులు లేకుండా చూస్తాం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
ఆలేరు, అక్టోబర్ 29 (విజయక్రాంతి): రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య(MLA Beerla Ilaiah) స్పష్టం చేశారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు పిలుపునిచ్చారు.
గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం, రాజాపేట, ఆలేరు, ఆత్మకూరు (ఎం) మండలాల్లో పీఏసీఎస్, ఐకేపీ, ఎఫ్‌పీఓల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం:
ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో పాటు, కొనుగోలు ప్రక్రియ పూర్తయిన మూడు రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులు ఆర్థికంగా బలోపేతం కావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
దళారుల చేతిలో రైతులు నష్టపోవద్దు:
కల్లాల వద్దకు వచ్చి అధిక ధరలు ఇస్తామని నమ్మించే దళారుల మాటలు నమ్మి రైతులు నష్టపోవద్దని ఎమ్మెల్యే సూచించారు. తూకంలో, ధర చెల్లింపుల్లో మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతులకు అవసరమైన చోట పెద్ద రైతుల కల్లాల వద్దే ధాన్యం తూకం వేసే సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు లేకుండా చర్యలు:
ధాన్యం కొనుగోలు సమయంలో తూకం, గన్నీ బ్యాగులు, రవాణా తదితర సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బీర్ల ఐలయ్య సూచించారు. రైతులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పీఏసీఎస్, ఐకేపీ, ఎఫ్‌పీఓల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గతంలో ఈ కేంద్రం ద్వారా సుమారు 50 వేల బస్తాల ధాన్యం కొనుగోలు చేశామని, ఈసారి అంతకంటే ఎక్కువ కొనుగోలు జరిగేలా రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
రైతులకు సహకార సంఘాలే అండ:
రైతులకు అవసరమైన రుణాలు అందించడం నుంచి పంటల కొనుగోలు వరకు సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సమయంలో ప్రభుత్వం, సహకార వ్యవస్థ అండగా ఉంటాయని తెలిపారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్న నేపథ్యంలో రైతులు సాగులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బీర్ల ఐలయ్య సూచించారు. నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటలను సాగు చేయాలని, పరిస్థితులను అంచనా వేయకుండా అధిక పెట్టుబడులు పెట్టి నష్టపోవద్దని కోరారు.
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాల ప్రారంభం, బొమ్మలరామారం మండలంలోని మర్యాల, చౌదర్‌పల్లి రాజాపేట మండలంలోని రఘునాథపురం, ఆలేరు మండలంలోని కొలనుపాక, ఆలేరు, కొల్లూరు, ఆత్మకూరు (ఎం) మండలంలోని కొరటికల్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీర్ల ఐలయ్య ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో ఆలేరు పీఏసీఎస్ చైర్మన్ జనగామ ఉపేందర్ రెడ్డి, బీజాని బాలమణి, సాగర్ రెడ్డి, గంధమల్ల అశోక్, మోహన్ రెడ్డి, మల్లయ్య, బొసు నరసింహ, లక్ష్మీనారాయణ, చెక్క వెంకటేష్, చాడ రాజు, సుక్క యాదమ్మ, స్వరూప, శ్రీనివాస్, భవాని, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.