అర్థనగ్న ప్రదర్శన

18-09-2026 | 04:18pm

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం (Central Government) చేపట్టనున్న జనగణలో ఓబీసీ కాలం పెట్టి, కులానికి ఒక యూనిక్ కోడ్ (Unique Code)పెట్టాలని డిమాండ్ చేస్తూ శుక్ర వారం మంచిర్యాల ఐబి చౌరస్తాలోని (Mancherial IB Junction) అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ పై దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైందనీ, జనగణన పట్టికలో 34 కాలమ్స్ ఉన్నాయనీ, ఓబీసీ కాలం చేస్తే అదనంగా ఇంకొక కాలం మాత్రమే చేరుతుందనీ, ఒక్క కాలం పెట్టడానికి అంగీకరించని కేంద్ర ప్రభుత్వం దేశంలోని 85 కోట్ల మంది బీసీలను ఎలా అభివృద్ధి చేస్తుందనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జన గణనలో కుల గణన భాగం చేస్తే బీసీలకు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థలలో ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందని కేంద్ర పాలకులు భావిస్తున్నారనీ, అంతే కాకుండా చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలనే డిమాండ్ ముందుకు వస్తుందనే భయంతో కేంద్ర ప్రభుత్వం కులాల వారి జనగణనకు వెనకాడుతుందన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది కర్రె  లచ్చన్న, రాష్ట్ర నాయకులు గజ్జల్లి వెంకటయ్య, చంద్రగిరి చంద్రమౌళి, పెద్దపల్లి సూరయ్య, గగ్గూరి రాజన్న, ముదిరాజు సేవా సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రాగి రాజేష్, రజక సంఘాల జిల్లా అధ్యక్షులు తంగళ్ళపల్లి బాపు, పద్మశాలి కుల సంఘ  బాధ్యులు చెలిమెల అంజయ్య, సతీష్, వేముల కిరణ్, జాతీయ బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు పూరెళ్ల నితీష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు