గోపనపల్లిలో మరో ప్రమాదం తలుపు తట్టింది
- ఎన్టీఆర్ నగర్‌లో ఒరిగిన నాలుగంతస్తుల భవనం
- అంజయ్యనగర్ కూల్చివేత నుంచి తేరుకోకముందే మరో షాక్
- 30–40 గజాల స్థలంలో పేకమేడల నిర్మాణం..స్థానికులు భయాందోళన
శేరిలింగంపల్లి,సెప్టెంబర్ 18(విజయక్రాంతి): ఇటీవల కాలంలో కొండాపూర్ డివిజన్ (Kondapur Division)పరిధిలోని అంజయ్యనగర్‌లో ఇటీవల నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఇద్దరు కార్మికులు మరణించిన ఘటన ఇంకా మనసుల్లోంచి తొలగకముందే గోపనపల్లి ఎన్టీఆర్ నగర్‌లో(Gopanapalli NTR Nagar) మరో భవనం ప్రమాదకరంగా ఒరిగిపోయింది. దీంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఎన్టీఆర్ నగర్‌లో కేవలం 30 నుంచి 40 గజాల ఇరుకు స్థలంలో నిర్మించిన నాలుగంతస్తుల భవనం ఒకవైపునకు వంగిపోయినట్లు స్థానికులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా, సెట్‌బ్యాక్‌లు లేకుండా చేపట్టిన నిర్మాణమే భవనాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిందని వారు ఆరోపిస్తున్నారు. భవనం మరింతగా ఒరిగితే పక్కనే ఉన్న ఇళ్లకు, వీధిలో తిరిగే ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని భయపడుతున్నారు.
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని 49వ సర్కిల్ ప్రాంతంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా, ముందుగానే ప్రమాదకర భవనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
విషయం తెలిసిన సీఎంసీ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు.నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా, నిబంధనలు పాటించారా, ప్రస్తుతం భవనం ఎంతమేర ప్రమాదకరంగా ఉందనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని, ప్రజలకు ముప్పు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.