ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి
అదనపు కలెక్టర్ రాములు
హాజీపూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని (Tahsildar's office) శని వారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు సందర్శించి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా విచారణలు పూర్తైన కేసులకు సంబంధించిన డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అవసరమైతే సెలవు రోజుల్లోనూ కార్యాలయ సిబ్బంది విధులు నిర్వహించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసి, ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం హాజీపూర్ తహసీల్దార్‌తో కలిసి ముల్కల్ల గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తపల్లి హామ్లెట్ సందర్శించి రీ-సర్వే ప్రక్రియ ప్రారంభంలో భాగంగా చేపడుతున్న గ్రామ సరిహద్దుల నిర్ధారణ పనులను పరిశీలించారు. గ్రామ సరిహద్దుల నిర్ధారణ, రీ-సర్వేకు సంబంధించిన పనులను నిబంధనల ప్రకారం సమన్వయంతో చేపట్టి, ప్రక్రియను సక్రమంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు