డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి: దూబగుంట అశోక్
మల్కాజిగిరి, సెప్టెంబర్ 6, (విజయక్రాంతి): భారత రత్న, తొలి ఉప రాష్ట్రపతి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్(Sarvepalli Radhakrishnan)ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సామాజిక కార్యకర్త, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వాహకులు, “గీతా బోధి” ఆశ్రమ(Geetha Bodhi Ashram) నిర్మాత దూబగుంట అశోక్ సూచించారు. నేరేడ్‌మెట్ మూడుగుళ్ల ఎదురుగా ఉన్న మండల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల హెడ్‌మాస్టర్ రోజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దూబగుంట అశోక్ మాట్లాడుతూ... డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మాదిరిగానే ప్రతి ఒక్కరూ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా కృషి చేయాలని అన్నారు. ప్రస్తుతం పాఠశాలలో తగినన్ని కుర్చీలు లేనట్టు తాను గమనించానని, ముందుగా తన వంతుగా 10 కుర్చీలను విరాళంగా అందజేస్తున్నానని ఆయన ప్రకటించారు. అన్నీ ప్రభుత్వమే సమకూర్చాలంటే సాధ్యం కాదని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలకు చేయూత అందించాలని ఆయన సూచించారు. మీలో పెద్దవారు అయిన తరువాత ఏ వృత్తిని స్వీకరిస్తారని ప్రశ్నించగా తొంభై శాతం పిల్లలు తాము ఉపాధ్యాయులం కావాలనుకుంటున్నట్లు చెప్పారు. కొందరు సైన్యంలో చేరతామన్నారు. ఉపాధ్యాయులు, సైనికులు ఏ వృత్తికి అయినా చదువు ముఖ్యం అని, ముందుగా అందరూ బాగా చదువుకోవాలని ఆయన సూచించారు.
అంతకు ముందు పాఠశాల హెడ్‌మాస్టర్ రోజా మాట్లాడుతూ.. నూట ముప్ఫై సంవత్సరాల క్రితం జన్మించి మంచి విద్యావేత్తగా, అత్యుత్తమ ఉపాధ్యాయుడుగా, వేదాంత విమర్శకుడుగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన డా. రాధాకృష్ణన్, మనదేశానికి ప్రథమ ఉప రాష్ట్రపతిగా పది సంవత్సరాలు సేవలు అందించిన తరువాత, 1962లో భారత రాష్ట్రపతి పదవి స్వీకరించి నిబద్ధతతో పని చేశారని తెలిపారు. ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ అందచేసి ప్రభుత్వం ఆయనను గౌరవించిందన్నారు. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 5వ తేదీని 1962 సంవత్సరం నుండి ‘ఉపాధ్యాయ దినోత్సవం’గా జరుపుకుంటున్నామని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, గీతా బోధి తరపున పి. సత్యనారాయణ, టి. బాలగంగాధరరావు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.






