గొల్లల గుడికి జాతీయస్థాయి గుర్తింపు
ములుగు జిల్లా పాలంపేట రామప్పగుడికి చేరువలో నైరుతి దిశలో ఉన్న గొల్లల గుడికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. దీంతో ఈ దేవాలయాల గురించి అందరిలో ఆసక్తి కలిగింది. భారత ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వశాఖ, భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ(ఏఎస్‌ఐ) జీవోలో జాతీయ ప్రాముఖ్యత గల నిర్మాణంగా ఆగస్టు 31న ప్రకటించింది. ఈ కట్టడం చేరికతో, తెలంగాణలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్‌ఐ) రక్షణలో ఉన్న స్మారక కట్టడాల సంఖ్య 10కి పెరిగింది.
జాతీయ స్మారక కట్టడం హోదా లభించడం వల్ల గొల్లల గుడి (Gollala Gudi) భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ రక్షణ, సంరక్షణ చట్టం పరిధిలోకి వస్తుంది. దీనివల్ల శాస్త్రీయమైన పద్ధతిలో సంరక్షణ, కట్టడాల పటిష్టతను అంచనా, ఆక్రమణల నుంచి, నష్టం నుంచి రక్షణ కల్పన, సందర్శకులకు ప్రవేశాది సౌకర్యాలు, వాస్తుశిల్పాలు డాక్యుమెంట్ (రికార్డ్) చేయబడతాయి,
కాకతీయ వారసత్వానికి (Kakatiya heritage)గుర్తింపు లభించడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. రామప్పగుడి అంత ప్రసిద్ధమైనది, ప్రజాదరణ పొందిన గుడి కాదు కాని, నిర్మాణంలో, ఆలయవాస్తులో గొల్లలగుడి గొప్ప దేవాలయం. కాకతీయు ల నాటి దేవాలయ వాస్తు శైలికి చెందిన గుడి. గొల్లల గుడి నిర్మాణశైలి, శిల్పాలనుబట్టి కాకతీయుల ఏలుబడి కాలంలో 13వ శతాబ్దానికి చెందినదని చెప్పవచ్చు. తెలంగాణలో కాకతీయ వారసత్వ నిర్మాణంలో మరో మణిమకుటం గొల్లలగుడి.
ఇది ఒక త్రికూటాలయం..
ఇది ఒక త్రికూటాలయం. మూడు గర్భగుడులు, వాటికి సంయుక్తంగా కాకతీయశైలి స్తంభాలతో ఒక అర్ధమంటపం, ప్రాచ్యాభిముఖంగా ఉన్నది గొల్లలగుడి. ఎత్తున అలంకృతమైన అధిష్టానంమీద దేవాలయం నిలబడిఉన్నది. గుడులపైన విడి, విడిగా విమానాలున్నాయి. గుడుల ద్వారశాఖల మీద శైవద్వారపాలకులు, పరిచారకులతో కనిపిస్తున్నారు. కాకతీయుల శైలికి ప్రత్యేకమైన అందమైన జాలకాలు(కిటికి)న్నాయి. స్తంభాల పైభాగంలో హంసధార, విష్ణు, లక్ష్మి, గణపతి, మహిషాసురమర్దినిల శిల్పాలు అగుపిస్తున్నాయి.
అధిష్టానం మీద రత్నపుష్పాలు, జంతుధారలు చెక్కబడ్డాయి. నాట్యకారులు, వాద్యకారులు, స్త్రీలు, సింహధార, అలసకన్యలతో అలంకరించబడ్డ దేవాలయం ఎంతో అందంగా కనబడుతున్నది. త్రికూటంలో ప్రధానగర్భాలయం ముందర నంది కొలువైవున్నాడు. రామప్పగుడి ముందరి నందిలెక్కనే గంటలు, పూసల పట్టెడలతో, దండలతో అలంకరించబడ్డది నంది. దేవాలయాలకు గొల్లలగుడి అని పేరు రావడం వెనక చారిత్రకత పరిశోధించవలసిన అంశం.
తెలంగాణాలోని మహబూబునగర్ జిల్లా జడ్చర్ల దగ్గరలో ఉన్న ఇటికెల నిర్మాణం జైనబసదిని గొల్లత్తగుడి అని పిలుస్తారు. శనిగరంలో, కొలనుపాకలో గొల్లత్త అని పిలువబడుతున్నది జైన శాసనదేవత ఆమ్రకూష్మాండిని లేదా అంబిక. ఎందుకు ఆ పేరు పెట్టారో అంతు తెలియదు. పురావస్తుశాఖ పూర్వసంచాలకులు వివి కృష్ణశాస్త్రి గారు గొల్లత్తగుడి వెనక ఉన్న గోళకీమఠాలనే గొల్లత్తగుడులనడంవల్ల ఆ జైనబసదిని గొల్లత్తగుడి అన్నారని తెలిపారు.
దేవాలయాలకు గొల్లలకు సంబంధం ఉందనే విషయం 16వ శతాబ్దం నుంచి నిర్మాణమైన గుడుల స్తంభాలపై గొల్లల శిల్పాలవల్ల తెలుస్తున్నది. గొల్లలు సంపన్నులు, ఆలయాల నిర్మాతలు, దాతలుగా ఉండేవారని చరిత్రలో ఉన్నది. అందువల్ల వారిచేత నిర్మించబడ్డ గుడి గొల్లలగుడిగా పేరువడ్డదని చెప్పే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ లో కొన్నిచోట్ల గ్రామదేవతల గుడులను గొల్లలగుడి, గొలల్ల పేరంటాలమ్మ గుడి అని పిలుస్తుంటారు. పశ్చిమగోదావరి జిల్లా వెలివర్రు ప్రాంతంలో గొల్లపేరంటాలమ్మ తల్లి ప్రసిద్ధమైన గుడి. రాయలసీమ ప్రాంతంలో గొల్లపల్లయ్యస్వామిగుడులు పేరు,ప్రఖ్యాతులున్న దేవాలయాలు.
యోగీశ్వర్ (వెంకటాపూర్), విజయక్రాంతి






