6 September, 2026 | 7:13 AM

కాంగ్రెస్ చేతగానితనం వల్లే కేఆర్‌ఎంబీ ఆదేశాలు

06-09-2026 | 05:15am
  1. ఏపీ నీటి దోపిడీ కేఆర్‌ఎంబీకి కానరావడం లేదా?
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : కేఆర్‌ఎంబీ ఆదేశాలు(KRMB directives) తెలంగాణ(Telangan)కు గొడ్డలిపెట్టు అని, శ్రీశైలం(Srisailam) నుండి విద్యుత్ ఉత్పత్తి(Power generation) నిలిపివేయాలని కేఆర్‌ఎంబీ ఆదేశాలు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) చేతగానితనానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) మండిపడ్డారు. ఎల్ నినో పేరు చెప్పి తెలంగాణ ప్రయోజనాలను కేఆర్‌ఎంబీ దెబ్బతీస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏ నిబంధనల ప్రకారం, ఏ హక్కుల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టు(Veligonda project)కు నీటిని తరలిస్తున్నారని ప్రశ్నించారు. కేఆర్‌ఎంబీకి ఏపీ నీటి దోపిడీ(AP water exploitation) కానరావడం లేదా అని నిలదీశారు. అక్కడ ఏపీ దర్జాగా వెలిగొండకు సాగునీరు తరలిస్తుంటే, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు మూసుకుని సహకరిస్తున్నదని, అక్కడ ఏపీ ప్రభుత్వం ఆంధ్రా ప్రయోజనాల కోసం పనిచేస్తుంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను, ప్రజలను గాలికి వదిలేసిందని ఆరోపించారు.

విభజన చట్టంలోని 11వ షెడ్యూలు ఒక్క తెలంగాణకు మాత్రమే వర్తిస్తుందా అని ప్రశ్నించారు. అసమర్ధపాలనతో రేవంత్ రెడ్డి శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లను ఏపీకి ధారాదత్తం చేశారని, నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు, కల్వకుర్తి ఎత్తిపోతల, జూరాల, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాల కింద రైతులపొలాలను ఎండబెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తే రైతులు బోర్ల కింద చేస్తున్న సాగుకు కరంటు అందే పరిస్థితి ఉండదని తెలిపారు.

ఆగస్టు 21న శ్రీశైలం రిజర్వాయర్‌లో 169 టీఎంసీలు ఉన్నాయని, నేడు 139 టీఎంసీలకు పడిపోయాయని, 15 రోజుల్లో 30 టీఎంసీలు మాయమయ్యాయని వెల్లడించారు. కేఎల్‌ఐ ద్వారా అన్ని మోటార్లు నడిస్తే రోజుకు ఎత్తివేసేది 2400 క్యూసెక్కులు మాత్రమేనని, అక్కడ ఇప్పుడు నడిచేది కేవలం మూడు మోటార్లు మాత్రమే అని తెలిపారు.

కృష్ణా జలాలను ఏపీ యధేచ్ఛగా తరలిస్తున్నా కాంగ్రెస్ సర్కారులో చలనం శూన్యమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కారు చేతగానితనమే ఈ దుస్థితికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, ఈ అసమర్ధ ప్రభుత్వానికి బుద్దిచెబుతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు