6 September, 2026 | 6:19 PM

నర్సు కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలి

06-09-2026 | 05:08pm

నర్సు కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి

కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి 10 ఎకరాల భూమి చేయించాలి

బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుంది

ఆదిలాబాద్ బీజేపీ పార్లమెంట్ సభ్యులు గోడెం నగేష్

ములకలపల్లి, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): అత్యాచారం, హత్యకు గురైన ఆదివాసీ నర్సు కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 10 ఎకరాల భూమిని మంజూరు చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో హత్యకు గురైన ములకలపల్లి మండలానికి చెందిన గిరిజన యువతి ఊకే శిరీష కుటుంబ సభ్యులను ఆదివారం

భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడెం నగేష్, మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్, భద్రాద్రి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి డా. విజయచంద్ర రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంటు బీజేపీ మాజీ అధ్యక్షులు యాపా సీతయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుంజా ధర్మ, పోడియం బాలరాజు, ములకలపల్లి మండల అధ్యక్షులు గుగులోత్ శంకర్ నాయక్‌లతో కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ బాధిత కుటుంబానికి కేవలం రూ.5 లక్షల పరిహారం అందించి, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చేతులు దులుపుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.

ఊకే శిరీష సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం, బాధిత కుటుంబానికి రూ.1 కోటి ఆర్థిక సహాయం, 10 ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని, న్యాయం కోసం అవసరమైన అన్ని విధాలుగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మాజీ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించిన వారిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన ప్రతి ఒక్కరికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

భద్రాద్రి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటనకు కారణమైన వ్యక్తులను వెంటనే శిక్షించాలని, అదేవిధంగా హాస్పిటల్ యాజమాన్యం మీద తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఊకే శిరీష కుటుంబానికి న్యాయం జరిగే వరకూ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని, ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్లకు ఈ విషయాన్ని చెప్పడం జరిగిందన్నారు. వారు సానుకూలంగా స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పారన్నారు.

ఈ కార్యక్రమంలో ములకలపల్లి మండలానికి చెందిన రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అనుమల శ్రీను, జిల్లా కార్యవర్గ సభ్యులు ఊకంటి మధుసూదన్ రావు, మండల ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు పున్నం బిక్షపతి, భోగి కృష్ణయ్య, డా. జాటోత్ వెంకన్న, రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్, జిల్లా కార్యదర్శి పూనియా నాయక్, రాష్ట్ర గిరిజన మోర్చా నాయకురాలు దొడ్డ అరుణ, మహిళా మోర్చా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, రాష్ట్ర గిరిజన మోర్చా నాయకులు తంబల రవి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారాం నాయక్, జిల్లా ఓబీసీ మోర్చా నాయకులు, జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు గొడ్ల రాజయ్య, జిల్లా ఓబీసీ మోర్చా నాయకులు కోటోజు రాంబాబు, బిజెపి మండల అధ్యక్షులు మెట్ట వెంకటేశ్వర్లు, నల్లమోతు రఘుపతిరావు, జబ్బురి రమేష్, రాపాక రమేష్, సాయి శ్రీను, జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి కోలా హరీష్, బిజెపి నాయకులు అర్చన రంగారావు, పాలకుర్తి ప్రసాద్, గూడా ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.





మరిన్ని వార్తలు