6 September, 2026 | 6:06 PM

చందుపట్ల సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన గ్రామీణ పేదల సంఘం

06-09-2026 | 04:59pm

రైతులకు రోజుకు 14 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని డిమాండ్

చివ్వెంల, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో శనివారం చివ్వెంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.

ఈ సందర్భంగా గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో విద్యుత్ సమస్య రైతులను తీవ్రంగా వేధిస్తోందని అన్నారు.

24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం రోజుకు కేవలం ఐదు నుంచి ఆరు గంటలపాటు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. బోర్లు, బావుల కింద రైతులు నాట్లు వేసి పంటలను సాగు చేస్తున్నప్పటికీ, సరైన సమయంలో విద్యుత్ అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల పంటలను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. 24 గంటల విద్యుత్ ఇవ్వలేని పరిస్థితిలో కనీసం రోజుకు 14 గంటల పాటు ఉదయం 7 గంటలు, రాత్రి 7 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కోడిబండ్లయ్య, భాషిపంగు సునీల్, ఎడ్ల వెంకన్న, ఉప్పుల మల్లయ్య, అభిమాల వెంకన్న, భూక్యా ఎంకన్న, కృష్ణయ్య, గురవయ్య, సైదులు, వెంకటేష్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు