300 ఏళ్ల తర్వాత రామప్పలో అద్భుత ఘట్టం

31-10-2026 | 12:55pm

బానోత్ యోగి, వెంకటాపూర్ (విజయక్రాంతి): కాకతీయుల అద్భుత శిల్పకళకు ప్రతీకగా, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ములుగు(Mulugu) జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు 300 ఏళ్లుగా మూసుకుపోయిన ఆలయ గర్భగుడిలోని సోమసూత్రం పునరుద్ధరించడంతో శివలింగానికి నిత్య జలాభిషేకాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రాచీన ఆలయ నిర్మాణానికి, అపురూప శిల్పసంపదకు ఎలాంటి నష్టం కలగకుండా పురావస్తుశాఖ అధికారులు, సాంకేతిక నిపుణులు చేపట్టిన ఈ పనులు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

ములుగు జిల్లా పాలంపేటలో కొలువుదీరిన రామప్ప దేవాలయం కాకతీయుల కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం. క్రీ.శ. 1213లో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని పాలనలో ఆయన సేనాధిపతి రేచర్ల రుద్రుడు ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. దాదాపు 40 ఏళ్లపాటు అద్భుత శిల్పకళా నైపుణ్యంతో నిర్మాణం కొనసాగినట్లు చరిత్ర చెబుతోంది. శిల్పి పేరుతో ప్రసిద్ధి చెందిన అరుదైన దేవాలయంగా రామప్ప ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇసుక పునాదుల నిర్మాణ పద్ధతి (Sandbox Technology), నీటిపై తేలే ఇటుకలు, సున్నితమైన శిల్పాలు నేటికీ సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. ఈ ఆలయానికి 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది.

ఇంతటి ప్రాచీన, విశిష్టమైన ఆలయంలో శివలింగానికి సుమారు 300 ఏళ్లుగా నిత్య జలాభిషేకాలు జరగడం లేదనే విషయం చాలామందికి తెలియదు. గతంలో సంభవించిన భూకంపం కారణంగా గర్భగుడిలోని సోమసూత్రం మూసుకుపోయినట్లు తెలుస్తోంది. సాధారణంగా శివాలయాల్లో శివలింగానికి అభిషేకం చేసిన నీరు సోమసూత్రం ద్వారా బయటకు వెళ్లేలా నిర్మాణం ఉంటుంది. అయితే రామప్ప ఆలయంలో ఈ మార్గం మూసుకుపోవడంతో అభిషేక జలాలు బయటకు వెళ్లే సంప్రదాయ వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. దీంతో నిత్య జలాభిషేకాలు నిలిచిపోయాయి.

మూడు శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు అధికారులు శాస్త్రీయ పద్ధతులను ఆశ్రయించారు. ఆలయ నిర్మాణానికి, శిల్పసంపదకు ఏమాత్రం నష్టం కలగకుండా అత్యాధునిక పరికరాలతో సోమసూత్రం పునరుద్ధరణ పనులు చేపట్టారు. త్రిమితీయ మ్యాపింగ్ (3D Mapping), ఎండోస్కోపిక్ పరికరాలు, గోప్రో కెమెరాలతో అంతర్గత పరిస్థితులను పరిశీలించారు. ప్రత్యక్ష పర్యవేక్షణ తెరల (Real-time Monitoring) ద్వారా ప్రతి దశను గమనిస్తూ, సున్నితమైన డ్రిల్లింగ్ విధానంలో అడ్డంకులను పొరలవారీగా తొలగించారు. ఎంతో జాగ్రత్తగా చేపట్టిన ఈ ప్రక్రియతో చివరకు సోమసూత్రం తిరిగి తెరుచుకుంది.

దేవాదాయశాఖ అధికారులు, కేంద్ర పురావస్తుశాఖ నిపుణులు, ఇంటాక్ ప్రతినిధుల పర్యవేక్షణలో సోమసూత్రం పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. దీంతో సుమారు 300 ఏళ్ల తర్వాత రామప్ప గర్భగుడిలో శివలింగానికి నిత్య జలాభిషేకాలు తిరిగి ప్రారంభమయ్యాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయంలో నిలిచిపోయిన సంప్రదాయం మళ్లీ ప్రారంభం కావడం ఆధ్యాత్మికంగానే కాకుండా చారిత్రకంగానూ విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు కాకతీయుల అద్భుత నిర్మాణ నైపుణ్యాన్ని కాపాడుతూనే, మరోవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాచీన ఆలయ వ్యవస్థను పునరుద్ధరించడం విశేషం. ప్రపంచ వారసత్వ సంపదగా నిలిచిన రామప్ప కీర్తి కిరీటంలో ఈ ఘట్టం మరో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోనుంది.

మరిన్ని వార్తలు