పూరిగుడిసె నుంచి సొంతింటికి
మఠంపల్లి, అక్టోబర్ 31 (విజయక్రాంతి): పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Housing Scheme) నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా పూరి గుడిసెల్లో జీవనం సాగిస్తున్న కుటుంబాలకు ఈ పథకం ద్వారా సొంతింటి ఆశలు చిగురిస్తున్నాయి.
గతంలో మఠంపల్లి మండలంలోని గ్రామ పంచాయతీల పరిధిలో పూరి గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలను గుర్తించేందుకు అధికారులు సర్వే (Household Survey) నిర్వహించారు. ఈ సర్వే ఆధారంగా విడుదల చేసిన తొలి జాబితాలో కొత్త దొనబండ తండా గ్రామ పంచాయతీకి చెందిన భూక్యా చందా (భర్త బాలు)కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.
ఈ నేపథ్యంలో శనివారం కొత్త దొనబండ తండా సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు, హౌసింగ్ ఏఈ జగదీష్‌తో కలిసి లబ్ధిదారుడి ఇంటి నిర్మాణానికి గ్రౌండింగ్ పనులను (Grounding Works) ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పూరి గుడిసెల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం భరోసా కల్పిస్తోందన్నారు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు (Government Welfare Schemes) అందేలా కృషి చేస్తానని తెలిపారు.
సొంతింటి నిర్మాణానికి తొలి అడుగు పడటంతో లబ్ధిదారుడి కుటుంబంలో ఆనందం వ్యక్తమైంది. ఈ కార్యక్రమంలో ఏపీఓ ఉమా, కార్యదర్శి నరేష్, ఫీల్డ్ అసిస్టెంట్ పీకా, వార్డు సభ్యులు నాగేశ్వరరావు, హాబీ, కృష్ణ, బాల, రమేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.