లక్ష మందితో బీజేపీ భారీ ప్లాన్
అమిత్ షా రాకతో హైదరాబాద్‌లో రాజకీయ వేడి.. లక్ష మందితో బీజేపీ మహా పాదయాత్రకు సన్నాహాలు!
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు కీలకంగా మారుతున్నాయి. హైదరాబాద్‌లో భారీ రాజకీయ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ (BJP) సిద్ధమవుతోంది. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం – అరాచకాన్ని తరిమికొడదాం’ అనే నినాదంతో నవంబర్ 2న నిర్వహించనున్న మహా పాదయాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah Hyderabad Visit 2026) హాజరుకానుండటంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏర్పాట్లను వేగవంతం చేసింది. లక్ష మంది హైదరాబాద్ ప్రజలు, పార్టీ కార్యకర్తలను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో Mobilisation చేపడుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహా పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు(Ramchander Rao) నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమిత్ షాకు ఘనస్వాగతం పలకడంతో పాటు పాదయాత్రను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ (Action Plan)పై చర్చించారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
నవంబర్ 2న హైదరాబాద్‌లో మహా పాదయాత్ర
బీజేపీ ప్రకటించిన తాజా వివరాల ప్రకారం, నవంబర్ 2న మధ్యాహ్నం 3 గంటలకు బషీర్‌బాగ్‌లోని నిజాం కాలేజీ సమీపంలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి మొజాంజాహీ మార్కెట్ చౌరస్తా వరకు కొనసాగనుంది. యాత్ర ముగిసిన అనంతరం అమిత్ షా అక్కడ జరిగే సభలో ప్రసంగించనున్నారు. పార్టీ కార్యకర్తలతో పాటు న్యాయవాదులు, వైద్యులు, మేధావులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ తెలిపింది.
కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
రాజ్యాంగబద్ధమైన సంస్థలపై కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని రాంచందర్ రావు ఆరోపించారు. ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) విషయంలో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నది బీజేపీ ప్రధాన అభ్యంతరం. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు కాంగ్రెస్ ఆరోపణలకు సమాధానం చెప్పడమే మహా పాదయాత్ర ఉద్దేశమని పార్టీ నాయకత్వం వెల్లడించింది. మరోవైపు, నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించనున్న ‘ఓట్ చోరీ’ వ్యతిరేక ర్యాలీకి మరుసటి రోజే హైదరాబాద్‌లో బీజేపీ ఈ పాదయాత్ర చేపడుతుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య SIR అంశంపై రాజకీయ వాదోపవాదాలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. అమిత్ షా పర్యటన, భారీ జనసమీకరణతో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ తన బలాన్ని చాటుకోవాలని భావిస్తోంది.