జనగణనకు డేట్ ఫిక్స్.. ఇంటింటికీ అధికారులు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2027 జనగణన (Census) నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ (Notification) జారీ చేసింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జనగణన ప్రక్రియకు సంబంధించిన తేదీలను వెల్లడించింది.
జనగణనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంతోపాటు వివరాల సేకరణను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్వీయ గణనకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలు ఆన్లైన్ (Online) ద్వారా తమ కుటుంబానికి సంబంధించిన వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు. ఈ విధానాన్ని సెల్ఫ్ ఎన్యుమరేషన్గా పిలుస్తున్నారు.
అనంతరం జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంటింటికీ వెళ్లి కుటుంబాల వివరాలను సేకరించనున్నారు. ప్రతి ఇంటికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయడంతోపాటు జనాభా గణన చేపట్టనున్నారు.
ఫిబ్రవరి 28తో ప్రధాన గణన ప్రక్రియ ముగియనుండగా, మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు రివిజన్ రౌండ్ (Revision Round) నిర్వహించనున్నారు. ఈ సమయంలో సేకరించిన వివరాలను మరోసారి పరిశీలించి, అవసరమైన సవరణలు చేపట్టనున్నారు.
దేశవ్యాప్తంగా జనాభా వివరాలను సమగ్రంగా సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. జనగణన ద్వారా సేకరించిన సమాచారం భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికల తయారీకి కీలకంగా ఉపయోగపడనుంది.