విమర్శలు కాదు.. వాస్తవాలు తేలాలి
బిజినేపల్లి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): వాహనం ఢీకొట్టడంతో ప్రమాదవశాత్తు (Accidentally) ధ్వంసమైన పార్టీ దిమ్మె విషయంలో రాజకీయాలకు, వ్యక్తిగత అంశాలకు ముడిపెట్టి అసత్య ఆరోపణలు (False Allegations) చేయడం తగదని వెల్గొండ సర్పంచి నాగిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు రామ లక్ష్మణ్ అన్నారు. ఆదివారం మండలంలోని వెల్గొండ గ్రామంలో టీడీపీకి చెందిన ధ్వంసమైన దిమ్మె వద్ద విలేకరుల సమావేశం (Press Meet) ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2023 ఆగస్టులో ఓ టిప్పర్ వాహనం ఢీకొనడంతో టీడీపీ దిమ్మె కూలిపోయిందని తెలిపారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేక ప్రత్యర్థులు బురద చల్లే ప్రయత్నంలో భాగంగా దిమ్మె ధ్వంసంపై సామాజిక మాధ్యమాల్లో (Social Media) అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ దిమ్మె ధ్వంసమైన ఫొటోలు, అందుకు సంబంధించిన ఆధారాలను (Evidence) అధికారుల ముందు ఉంచుతామని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో కొందరు రాజకీయ చిచ్చు రేపుతూ, తగాదాలు సృష్టిస్తూ, అక్రమ కేసులు పెట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాపకంటి బాలస్వామి, సూర్యశేఖర్ రెడ్డి, యాదిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.