వ్యవసాయ అధికారిపై కలెక్టర్ ఆగ్రహం

26-10-2026 | 05:45pm

- సస్పెన్షన్‌కు ఆదేశాలు

కల్వకుర్తి అక్టోబర్ 26: రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహించడంపై జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్(Collector Hemanth Keshav Patil) ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో పర్యటించిన ఆయన.. 75 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలు అందిస్తున్న విషయం రైతులకు తెలియక ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారని గుర్తించారు.

దీంతో మండల పశుసంవర్ధక శాఖ ఏవో డాక్టర్ నాగరాజును సస్పెండ్ చేయాలని ఆదేశించడంతోపాటు, వ్యవసాయ శాఖ ఏఈఓ సురేష్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. సోమవారం మార్చాల గ్రామంలో రైతు తాజుద్దీన్ వ్యవసాయ క్షేత్రంలోని ఫామ్ పాండ్‌ను, కృష్ణయ్య నిర్వహిస్తున్న మూడున్నర ఎకరాల డైరీ ఫామ్‌ను కలెక్టర్ పరిశీలించారు. పశువులకు అవసరమైన గడ్డి విత్తనాలను ఎక్కడి నుంచి తెస్తున్నారని కృష్ణయ్యను ప్రశ్నించగా, ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వ సబ్సిడీ పథకం గురించి తమకు తెలియదని రైతు చెప్పడంతో కలెక్టర్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం అధికారుల బాధ్యతని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యవసాయం, పశుపోషణ ద్వారా రైతులకు అదనపు ఆదాయం అందించే పథకాల వివరాలను అర్హులందరికీ తెలియజేయాలని ఆదేశించారు. పర్యటనలో సర్పంచ్ తలసాని కృష్ణారెడ్డి, తహసీల్దార్ ఇబ్రహీం, ఎంపీడీవో యాదయ్య, పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు