ఢిల్లీలో కలకలం.. జర్నలిస్టులపై లైంగిక వేధింపులు

04-10-2026 | 02:02pm

కెమెరా పట్టిన చేతులపైనే దాడా? ఢిల్లీలో కలకలం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళా(Delhi women journalists harassment) జర్నలిస్టుల భద్రత, మీడియా స్వేచ్ఛపై తీవ్ర చర్చ మొదలైంది. జంతర్ మంతర్(Jantar Mantar incident) వద్ద నిరసన కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న ముగ్గురు మహిళా జర్నలిస్టులపై పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఫిర్యాదులపై విమర్శలు వెల్లువెత్తడంతో ఢిల్లీ పోలీసులు విచారణను క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు.

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా(Gyanesh Kumar resigns) చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జరిగిన నిరసనలను కవర్ చేసేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. బాధితుల్లో ఒకరైన మహిళా జర్నలిస్ట్.. తాను పోలీసుల చర్యలను వీడియో తీస్తుండగా ఓ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. అసభ్యంగా తాకి, పక్కకు నెట్టేశారని ఫిర్యాదులో(women journalists complaint) పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని జర్నలిస్టులు ఆరోపించారు.

దీంతో పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు అక్కడే నిరసనకు దిగినట్లు సమాచారం. మహిళా జర్నలిస్టుల ఫిర్యాదులపై నిష్పక్షపాత విచారణ జరగాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ ఆరోపణలు ఇంకా విచారణలో ఉన్న నేపథ్యంలో వాస్తవాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు భయం లేకుండా విధులు నిర్వహించగలగాలని, దేశ రాజధానిలోనే ఇలాంటి ఆరోపణలు రావడం మీడియా స్వేచ్ఛపై ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు( Delhi Police allegations) తక్షణ చర్యలు తీసుకోవాలని, మీడియా ప్రతినిధులకు భద్రతతో కూడిన పని వాతావరణం కల్పించాలని కోరింది.

అమిత్ షాను ప్రశ్నించిన రాహుల్ గాంధీ

మహిళా జర్నలిస్టులపై వేధింపుల ఆరోపణల వ్యవహారంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi) తీవ్రంగా స్పందించారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్నందున ఈ ఘటనకు అమిత్ షా(Amit Shah) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు నమోదు చేయాలని కోరుతూ జర్నలిస్టులు గంటల తరబడి నిరసన చేపట్టాల్సి రావడం దారుణమని ఆయన విమర్శించారు. ఒక మహిళ ఫిర్యాదును నమోదు చేయడానికి కూడా ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించిన రాహుల్.. అమిత్ షా ఎక్కడున్నారని, ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని ‘ఎక్స్’ వేదికగా నిలదీశారు. మరోవైపు, ఫిర్యాదులను క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేయడంతో విచారణపై ఆసక్తి నెలకొంది. ఆరోపణలపై దర్యాప్తు ఎంత వేగంగా సాగుతుంది? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

మరిన్ని వార్తలు