విగ్రహం లేని ఆండాలమ్మ గుడి

20-09-2026 | 05:25am

పెద్దపల్లి (విజయక్రాంతి) : గుడి అంటే దేవతా విగ్రహం, నిత్యపూజలు, భక్తుల సందడి గుర్తుకొస్తాయి. కానీ పెద్దపల్లి జిల్లా(Peddapalli District)లోని ఓ పురాతన ఆలయం(Ancient temple) మాత్రం అందుకు పూర్తి భిన్నం. దేవతా విగ్రహం లేకుండానే వందల ఏళ్లుగా చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న ఆండాలమ్మ ఆలయం(Andalamma Temple) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామపంచాయతీ(Muttaram Gram Panchayat) పరిధిలోని ధర్మాబాద్ ప్రాంతంలో కొండల మధ్య ప్రకృతి రమణీయత నడుమ ఈ ఆలయం ఉంది. పెద్దపల్లి పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెపుతున్నారు. అప్పట్లో ఈ ప్రాంతాలను పాలించిన స్థానిక జమీందారు ఎరబతి నరసింగరావు(Erabati Narasinga Rao) ఆలయాన్ని నిర్మించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.

విగ్రహం ఎందుకు లేదు?

ఆలయం నిర్మాణం పూర్తయినప్పటికీ గర్భగుడిలో ప్రధాన దేవతా విగ్రహం ప్రతిష్ఠించబడలేదు. దీనికి సంబంధించి స్థానికంగా భిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆలయ నిర్మాణం అనంతరం ప్రతిష్ఠకు ముందే జమీందారు మరణించడంతో ఆ కార్యక్రమం నిలిచిపోయిందని కొందరు చెపుతుండగా, గుప్తనిధుల కోసం జరిగిన తవ్వకాల్లో విగ్రహం తొలగించబడిందని మరికొందరు చెపుతున్నారు. అయితే ఈ కథనాలకు స్పష్టమైన చారిత్రక ఆధారాలు నిర్ధారించాల్సి ఉంది.

షూటింగ్‌లకు ఫేమస్ స్పాట్

పురాతన నిర్మాణశైలి, కొండల అందాలు, ప్రశాంతమైన వాతావరణం కారణంగా ఆండాలమ్మ ఆలయం ఇప్పుడు షూటింగులకు ప్రత్యేక వేదికగా మారింది. జానపద గీతాలు, షార్ట్‌ఫిల్మ్‌లు, ప్రీ వెడ్డింగ్ షూట్లతో పాటు సారంగదరియా పాట, బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. 

పరిరక్షణ కోసం ఎదురుచూపులు

బయటి నుంచి అద్భుతంగా కనిపించే ఆలయం లోపలి భాగం మాత్రం కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది. మండపం పైకప్పు, నేల తదితర ప్రాంతాలకు మరమ్మతులు అవసరం. ఆలయానికి రహదారి, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించడంతో పాటు చారిత్రక కట్టడంగా గుర్తించి పరిరక్షించాలి. గతంలో ఆలయ గోపురం ధ్వంసమైన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది.

మరిన్ని వార్తలు