పోలీసు పెట్రోలింగ్ వాహనంపై దాడి
జవహర్‌నగర్,(విజయక్రాంతి): విధి నిర్వహణలో భాగంగా న్యూసెన్స్ కాల్‌కు వెళ్లిన పోలీసు పెట్రోలింగ్ సిబ్బందిపై(Police patrol personnel) దాడి చేసి, ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేసిన ఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన వివరాల ప్రకారం గబ్బిలాల్‌పేటలో న్యూసెన్స్ కాల్‌కు వెళ్లిన కానిస్టేబుల్ (PC-13079) వడ్త్యావత్ శివ, డ్రైవర్ (HG-2018) లక్ష్మణ్‌లు పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో నవీన్ కుమార్, నందు పెట్రోలింగ్ వాహనానికి(patrolling vehicle) అడ్డుపడి రాయితో ముందు అద్దాన్ని పగులగొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం శివకృష్ణ, మనోహర్, వెంకటేశ్వర్లు, అక్కమ్మ, స్నేహలత, సుశీల, శివ, భాస్కర్, అభినవ్ తదితరులు వాహనం వెనుక డోర్‌ను బలవంతంగా తెరిచి దినేష్, రాజకుమారిపై దాడి చేసి బయటకు లాగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పోలీసు సిబ్బందికి గాయాలు కావడంతో పాటు వాహనం దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. కానిస్టేబుల్ శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.