డీయూఎస్‌యూలో ఏబీవీపీ విజయభేరి

20-09-2026 | 05:10am
  1. విశ్వవిద్యాలయ ఎన్నికల్లో 3 స్థానాలు కైవసం
  2.    17 ఏళ్లలో తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థి గెలుపు
  3. చతికిల పడ్డ కాంగ్రెస్ అనుబంధ ఎన్‌ఎస్‌యూఐ
  4.    40.46 శాతం ఓటింగ్ ఫలితాలు విడుదల
  5. అబద్ధాలను తిరస్కరించిన జెన్‌జీలు
  6. ఢిల్లీ వర్సిటీలో ఏబీవీపీ విజయంపై బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు హర్షం

న్యూఢిల్లీ/హైదరాబాద్, సెప్టెంబర్ 19: హోరాహోరీగా కొనసాగిన డీఎస్‌డీయూ (ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్)(Delhi University Students Union) పోరులో ఏబీవీపీ మూడు స్థానాలను గెలుచుకొని సత్తా చాటింది. స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలవగా, కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న ఎన్‌ఎస్‌యూఐ చతికిలపడింది. డిల్లీ విశ్వవిద్యాలయం(Delhi University)లో విద్యార్థి సంఘం ఎన్నిక(Student Union Election)ల్లో ఏబీవీపీ విజయం సాధించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు.

జెన్‌జీలు అబద్ధాలను తిప్పికొట్టారని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీ యూనివర్సి టీ ఎన్నికల్లో 52 అనుబంధ కళాశాలల విద్యార్థులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. 1,51,519 మంది విద్యార్థులకు గాను, 61,312 (40.46 శాతం) మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శనివారం ఓట్ల కౌంటింగ్ జరిగింది. 18 రౌండ్లలో జరిగిన కౌంటింగ్ నువ్వా నేనా అన్నరీతిలో హోరాహోరీగా కొనసాగినా చివరకు ఏబీవీపీ విజయభేరి మ్రోగించి పట్టు నిలుపుకుంది. 17 ఏళ్లలో స్వతంత్ర అభ్యర్థి డీఎస్‌డీయూలో గెలవడం ఇదే తొలిసారి.

ఏబీవీపీకి చెందిన యశ్ దబాస్ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా రియా చావ్రి, సంయుక్త కార్యదర్శిగా రాజ్ సింగ్‌లు విజయం సాధించారు. ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ సొంతం చేసుకున్నారు. అధ్యక్ష పదవికి ఏబీ వీకి చెందిన యశ్ దాబస్‌కు 24,576 ఓట్లు రాగా, ఎన్‌ఎస్‌యూఐకి చెందిన విజయ్ శంకర్ మీనాకు 22,523 ఓట్ల లభించాయి. ఉపా ధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకిన్‌కు 30,615 ఓట్లు, ఏబీవీపికి చెందిన ఇషు మౌర్యకు 16,910, ఎన్‌ఎస్‌యూఐకి చెందిన వీర్ ఛత్రథ్‌కు 4,313 ఓట్లు మాత్రమే లభించాయి.

కార్యదర్శి పదవికి రియాచావ్డీ (ఏబీవీపీ)కి 21,650 ఓట్లు పోలవగా, ఎన్‌ఎస్ యూఐకి చెందిన నమ్రతా చౌదరికి 14869 ఓట్లు దక్కాయి. సంయుక్త కార్యదర్శి (ఏబీవీపీ) లక్ష్యరాజ్ సింగ్‌కు 16,615 ఓట్లు, ఎన్‌ఎస్ యూఐకి చెందిన గోపాల్ చౌదరికి 15,206 ఓట్లు దక్కాయి. ప్రపంచవ్యాప్తంగా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి విభాగం ఎన్నికలను పలుదేశాలు, నిపుణులు, ఆర్థికవేత్తలు, మేధావులు తదితరులు నిశితంగా గమనిస్తుంటారు. ఈ ఎన్నికల ఫలితాలు జెన్‌జీ తరం మనోభావాలను ప్రతిబింబించాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇటీవల ఢిల్లీలో జెన్‌జీ కాక్రోచ్ జనతా పార్టీ జంతర్‌మంతర్ వద్ద నిరసన తరువాత ఈ ఎన్నికల ఫలితాలు నిపుణులను సైతం ఆశ్చర్యపరిచాయి. ఏది ఏమైనా ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఉన్న ఏబీవీపీ విజయఢంకా మోగించగా, స్వతంత్ర అభ్యర్థి సత్తా చాటాడు. కాంగ్రెస్ మద్దతున్న ఎన్‌ఎస్‌యూఐ మాత్రం ఘోరంగా విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

దీపాంశు షౌకీన్‌ది సామన్య కుటుంబం

డీఎస్‌డీయూ ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన దీపాంశు షౌకీన్ 30,615 ఓట్లతో గెలుపొందాడు. అతని సమీప ఏబీవీపీకి చెందిన అభ్యర్థి ఇషూ మౌర్యకు 16,910 ఓట్లు దక్కాయి. ఢిల్లీలోని పీరాగఢికి చెందిన దీపాంశు సామాన్య కుటుంబానికి చెందినవాడు. తండ్రి ఆర్టీసీ బస్సు కండక్టర్, తల్లి అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థిగా టికెట్ ఆశించి నామినేషన్ వేసినా చివరిక్షణంలో నామినేషన్ వెనక్కి తీసుకోవాలని కోరగా నిరాకరించి బరిలోకి దిగాడు. విద్యార్థుల సమస్యల పరిష్కారాల్లో చురుకుగా వ్యవహరించడంతో విద్యార్థులు ఇతనివైపు మొగ్గుచూపారు. 

రైతు బిడ్డ రియా ఛావ్డీ

2023లో ఏబీవీపీలో చేరారు. శ్రీఅరబిందో కళాశాల విభాగానికి ఉపాధ్యాక్షురాలిగా ఉన్నారు. బదర్‌పూర్‌లోని మోలద్బంద్ గ్రామంలోని ఒక చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. విద్యార్థుల సమస్యలపై చురుకుగా వ్యవహరిస్తూ విశ్వవిద్యాలయ కార్యకలాపాలకు తనవంతు సహకారం అందిస్తూ వస్తున్నారు. ఈ మె ఇంటర్ కాలేజ్‌లో బాస్కెట్ బాల్ క్రీడాకారిణి. 

టెన్నిస్ ఆటగాడు యశ్‌దబాస్

ఢిల్లీలోని కంఝావాలా గ్రామానికి చెందినవాడు. ఏబీవీపీ కార్యకర్త. ఆరేళ్లుగా విద్యార్థి కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నాడు. జాతీయ, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఆటగాడు. మహిళల భద్రత, హాస్టళ్లలో పింక్ బాత్‌లు ఏర్పాటు పోరాటంలో ఇతను కీలకంగా వ్యవహరించాడు.

అబద్ధాలను తిరస్కరించిన జెన్‌జీలు

డిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ విజయం సాధించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు శనివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ దేశపు జెన్‌జీ తరం అబద్ధాలను తిరస్కరించి నిజాలను ఎంచుకున్నారని తెలిపారు. స్వార్థ ప్రయోజనాలతో నడిచే, యువత సంరక్షకులమని చెప్పుకునే వారి దుష్ట ప్రయత్నాలన్నీ విద్యార్థులను తప్పుదోవ పట్టించడంలో విఫలమయ్యాయని పేర్కొన్నారు. విద్యార్థులు, జెన్‌జీ తరం మోదీకి అండగా నిలుస్తున్నారని, ఏబీవీపీ కార్యకర్తలందరికీ, విజేతలకు అభినందనలు తెలిపారు. 

మరిన్ని వార్తలు