5 September, 2026 | 10:53 PM

హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్

05-09-2026 | 09:07pm

కత్తితో దాడి చేసిన నిందితుడిని పట్టుకున్న మంథని సీఐ బుద్ధే స్వామి

మంథని,(విజయక్రాంతి): భార్యతో సంబంధం ఉందనే పాత అనుమానంతో యువకుడిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని మంథని సీఐ బుద్ధె స్వామి(Manthani CI Buddha Swamy) అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీ(Judicial custody)కి తరలించారు. సీఐ కథనం ప్రకారం.. ఆరింద గ్రామానికి చెందిన గడుపు చిన్న బానయ్య అనే వ్యక్తి, పుల్లారి శ్రీధర్ తన భార్యతో సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 3వ తేదీ రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో మల్లారం ఎస్సీ కాలనీలో ముందస్తు పథకం ప్రకారం శ్రీధర్‌పై కత్తితో దాడి చేశాడు.

కత్తితో తలపై దాడి చేయగా, శ్రీధర్ ఎడమ చేతితో అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆయన తలకు, ఎడమ చేతికి రక్తస్రావ గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని తొలుత మంథని ప్రభుత్వ ఆసుపత్రి(Manthani Government Hospital)కి తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడు పుల్లారి శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంథని పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం. 203/2026, సెక్షన్ 109 బీఎన్‌ఎస్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఆరింద గ్రామంలో నిందితుడు చిన్న బానయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నేరానికి ఉపయోగించిన కత్తిని పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని మంథని పోలీస్ స్టేషన్‌కు తరలించి అరెస్టు నమోదు చేసిన అనంతరం, మంథని ప్రిన్సిపల్ ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం ముందు హాజరుపరచగా న్యాయమూర్తి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు మంథని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని ఎస్ఐ సందీప్ కుమార్. సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు