గుట్టుగా గుప్త నిధుల తవ్వకాలు?
– అతి పురాతనంగా కనిపిస్తున్న ఆనవాళ్లు
– సంఘటనా స్థలంలో పగిలిన పాత కుండల శకలాలు
– రంగంపేట గ్రామంలో గుప్పుమంటున్న పుకార్లు
– గతంలోనూ తవ్వకాలు జరిగినట్లు ఆనవాళ్లు
– కరువైన అటవీ అధికారుల పర్యవేక్షణ
గజ్వేల్: రంగంపేట గ్రామ(Rangampet village) పరిధిలో గుప్త నిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు రహస్యంగా తవ్వకాలు జరిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటవీ ప్రాంతంలో కొన్ని చోట్ల అతి పురాతనంగా కనిపించే తవ్వకాల ఆనవాళ్లు, అక్కడక్కడా పగిలిన పాత కుండల శకలాలు కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాత్రి వేళల్లో కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు చేపట్టినట్లు గ్రామంలో పుకార్లు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఇదే ప్రాంతంలో తవ్వకాలు జరిగినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
అయితే ఈ తవ్వకాలు నిజంగా గుప్త నిధుల(Hidden treasures) కోసమే జరిగాయా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. అటవీ ప్రాంతాల్లో ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అటవీ అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పురాతన వస్తువులు లేదా చారిత్రక అవశేషాలు లభించే అవకాశం ఉన్నందున అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, తవ్వకాల వెనుక ఉన్న వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.






