పోస్టుమార్టానికి డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిపై చర్యలు ఎప్పుడంటూ ప్రశ్నలు

25-09-2026 | 03:43pm

బోధన్, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): బోధన్ జిల్లా ఆస్పత్రిలో (District Hospital)పోస్టుమార్టం కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సద్దాం హుస్సేన్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. రాహుల్ కుమార్ సంబంధిత స్పార్క్ ఏజెన్సీకి (Spark Agency)సమాచారం అందించినట్లు తెలిపారు. అయితే ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు సంబంధిత వ్యక్తిపై స్పార్క్ ఏజెన్సీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పోస్టుమార్టం ప్రక్రియ కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆస్పత్రి అధికారులు స్పందించి విషయాన్ని స్పార్క్ ఏజెన్సీ నిజామాబాద్ గంగాధర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని విధుల నుంచి తొలగించడంతో పాటు తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్పార్క్ ఏజెన్సీదేనని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.

ఈ విషయంపై ఇప్పటికే సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా సమాచారం అందించినప్పటికీ చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ కుమార్ పేర్కొన్నట్లు తెలిసింది. పోస్టుమార్టం వంటి సున్నితమైన వైద్య ప్రక్రియలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు రావడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్పార్క్ ఏజెన్సీ అధికారులు వెంటనే స్పందించి ఆరోపణలపై విచారణ జరిపి, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు