బీజేపీలో ఛేంజెస్..రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP)లో సంస్థాగతంగా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు(New In charges), సహ ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ పార్టీ జాతీయ నాయకత్వం బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయ ఇన్చార్జి తరుణ్ చుగ్ వెల్లడించారు.
తెలంగాణ బీజేపీ ఇన్చార్జ్గా సునీల్ బన్సల్‌ను నియమించారు. ఆయనకు సహ ఇన్‌చార్జ్‌లుగా అభయ్ పాటిల్, రేఖా శర్మ బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్చార్జ్గా డాక్టర్ అరవింద్ భదోరియాను నియమించగా, సహ ఇన్చార్జ్గా వనతి శ్రీనివాసన్ వ్యవహరించనున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఇన్చార్జ్ బాధ్యతలను కూడా సునీల్ బన్సల్‌కే అప్పగించారు. ఇక తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఇన్చార్జ్గా రామ్ మాధవ్‌ను నియమించారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఇన్చార్జ్గా వినోద్ తావ్డే బాధ్యతలు చేపట్టనున్నారు.
పలు రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలను మరింత సమన్వయం చేయడం, సంస్థాగతంగా బలోపేతం చేయడం, రాబోయే కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించడం వంటి బాధ్యతలను కొత్త ఇన్‌చార్జ్‌లు, సహ ఇన్‌చార్జ్‌లు నిర్వర్తించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాల అమలులో వీరి పాత్ర కీలకం కానుంది.