ఉద్యోగులకు డబుల్ డీఏ.. చర్చలు సక్సెస్!
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల(Government employees)కు శుభవార్త. పెండింగ్లో ఉన్న డీఏ(DA)లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో ఉద్యోగ జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలుస్తోంది. డు డీఏలు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించగా..ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఇందుకు సమ్మతి తెలిపినట్లు సమాచారం.
కొంతకాలంగా పెండింగ్లో ఉన్న డీఏలపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి.తాజాగా జరిగిన చర్చల్లో రెండు డీఏల విడుదలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు డీఏలు పెండింగ్లో ఉండగా..తొలుత రెండు డీఏలను విడుదల చేసి,మిగిలిన వాటిని పీఆర్సీతో అనుసంధానం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కేబినెట్ ముందుకు రెండు డీఏలు
రెండు డీఏలపై ఉద్యోగ సంఘాలతో ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో.. తదుపరి ప్రక్రియపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వచ్చే కేబినెట్ సమావేశంలో రెండు డీఏలకు ఆమోదం తెలిపే అవకాశంఉందని ఉద్యోగ సంఘాల వర్గాలు చెబుతున్నాయి.కేబినెట్ ఆమోదం తర్వాత డీఏల విడుదలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంటుంది.
డీఏలతో పాటు పీఆర్సీ నివేదిక, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్),ఉద్యోగులు–పెన్షనర్ల పెండింగ్ బిల్లులు వంటి ప్రధాన డిమాండ్లపైనా చర్చలు జరిగినట్లు సమాచారం. ఉద్యోగ జేఏసీ ప్రధానంగా నాలుగు అంశాలపై ప్రభుత్వం నుంచి నిర్ణయం కోరుతోంది. మంగళవారం జరగాల్సిన చర్చలు వాయిదా పడగా.. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు జేఏసీ నేతలకు సీఎస్ సమాచారం ఇచ్చారు. ఆ సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. రెండు డీఏలకు అంగీకారం లభించడంతో.. ఇక ఉద్యోగుల చూపంతా కేబినెట్ నిర్ణయం, ఆ తర్వాత వెలువడే ఉత్తర్వులపైనే ఉంది.