వర్షం ఎఫెక్ట్...ఊడిన పెచ్చులు!
23-09-2026 | 05:11pm
హైదరాబాద్: హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం చారిత్రక కట్టడం చార్మినార్(Charminar)పై ప్రభావం చూపింది. లాడ్‌బజార్(Laad Bazaar) వైపు ఉన్న చార్మినార్ భాగం నుంచి కొన్ని పెచ్చులు ఊడిపడటంతో కలకలం రేగింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.పెచ్చులు పడిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై శిథిలాలను తొలగించారు. పర్యాటకులు ఆ ప్రాంతానికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. సుమారు అరగంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతోనే పెచ్చులు ఊడినట్లు తెలుస్తోంది. 430ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన చార్మినార్‌ను నిత్యం వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. దీంతో అధికారులు భద్రతా చర్యలు ముమ్మరం చేసి కట్టడాన్ని పరిశీలిస్తున్నారు. చార్మినార్‌కు జరిగిన నష్టం ఎంత అన్నది అధికారుల పరిశీలన అనంతరం స్పష్టత రానుంది.