5 September, 2026 | 9:45 PM

కాంగ్రెస్ మంచి చేయడమే మర్చిపోయింది

05-09-2026 | 07:52pm

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల విఫల పాలనపై భారీ నిరసన

 మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్‌,(విజయక్రాంతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు(Students) నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌(Fee reimbursement) బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పాలిటెక్నిక్‌ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న జీవో 97ను రద్దు చేయాలని, గురుకులాలు, వసతిగృహాల్లో నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. రెండు లక్షల ఉద్యోగాల హామీని అమలు చేసి జాబ్‌ క్యాలెండర్‌(Job Calendar) విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్థినులకు స్కూటీలు, కల్యాణలక్ష్మి, తులం బంగారం వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన నియామక ప్రక్రియకు చివర్లో నియామక పత్రాలు ఇచ్చి తామే ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్‌ చెప్పుకోవడం సరికాదన్నారు. మహబూబ్‌నగర్‌లో తాము నిర్మించిన వెయ్యి పడకల ఆసుపత్రిని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అమర్‌రాజా కంపెనీని తీసుకువచ్చి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని, పెద్ద సంఖ్యలో గురుకులాలు, వసతిగృహాలు ఏర్పాటు చేశామని శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

రైతులకు సక్రమంగా విద్యుత్‌, యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్‌, ముడా మాజీ చైర్మన్‌ గంజి వెంకన్న, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నర్సింహులు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆంజనేయులు, సీనియర్‌ నాయకులు గిరిధర్‌ రెడ్డి, కట్ట రవికిషన్‌, కిషోర్‌ కుమార్‌, నవకాంత్‌, శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీశైలం, అనంత రెడ్డి, విద్యార్థి నాయకులు శివకుమార్‌, సుదీప్‌ రెడ్డి, నవీన్‌ రాజు, గణేష్‌, సత్యపాల్‌, మనీష్‌, అఖిల్‌, ప్రమోద్‌, రాకేష్‌, నీరాజ్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు