ప్రతిభ కనబర్చిన విద్యార్థిని కి లక్ష రూపాయల నగదు బహుమతి
బెజ్జూర్, సెప్టెంబర్24, విజయ క్రాంతి: రాష్ట్ర ప్రభుత్వం(State Government) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారాల(State Level Talent Awards) ప్రదానోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జెడ్పీ పాఠశాలల విద్యార్థినులకు ఈ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులను స్వయంగా సన్మానించారు. ఒక్కొక్కరికి రూ.1,00,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
కొమరం భీం జిల్లాకు గర్వకారణం: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కౌటాల మండలం లోని ముత్తంపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని చిలువేరి లావణ్య ఎంపికై జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఇంతటి అద్భుత ప్రతిభ కనబర్చడం అభినందనీయమని గవర్నర్ ఈ సందర్భంగా కొనియాడారు. బాలికా విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇలాంటి పురస్కారాలు ఎంతో దోహదపడతాయని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.