తృటిలో తప్పిన ప్రమాదం!
బాలాపూర్: హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్(Meerpet Police Station) పరిధిలో గురువారం తెల్లవారుజామున బస్సులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గాయత్రి నగర్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నాగోల్‌కు చెందిన శ్రీ మహాలక్ష్మి రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన సుమారు 150 మంది గణేశ్ విగ్రహ నిమజ్జనం(Ganesh Immersion), దర్శనం కోసం మూడు బస్సుల్లో శ్రీశైలం(Srisailam) బయలుదేరారు.
ఈ క్రమంలో గురువారం రాత్రి సుమారు 2 గంటల సమయంలో గాయత్రి నగర్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద రెండు బస్సులకు డీజిల్ పోస్తున్నారు. అదే సమయంలో ప్రధాన రహదారిపై నిలిపి ఉన్న TS 15 T 8558 నంబర్ గల శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ బస్సులో(Sri Lakshmi Narasimha Travels bus) కుడివైపు ఇంజిన్ భాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. మంటలను గుర్తించిన డ్రైవర్ వెంటనే బస్సు నుంచి బయటకు వచ్చి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో ప్రయాణికులంతా హుటాహుటిన బస్సు దిగి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
MUST READ: స్లీపర్ బస్సులో మృత్యుఘోష
పూర్తిగా దగ్ధమైన బస్సు
మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు. అయితే బస్సు పూర్తిగా కాలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం కారణంగా ప్రధాన రహదారిపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. బస్సులో మంటలు చెలరేగడానికి గల అసలు కారణం ఏమిటన్న దానిపై మీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపం(Technical fault in the engine) కారణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.