నాణ్యతతో.. నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

24-09-2026 | 03:03pm

అచ్చంపేట: ఉప్పునుంతల మండలం రాయిచేడ్‌ గ్రామంలో (Rayichad village)నిర్మిస్తున్న అచ్చంపేట నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల(Integrated Residential School) నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటీల్‌ గురువారం పరిశీలించారు. అచ్చంపేట సబ్‌కలెక్టర్‌ సలోని చాబ్రాతో కలిసి నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించిన ఆయన.. పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ సూచించారు. నిర్మాణ సామగ్రి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.

విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలతో పాటు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు. తరగతి గదులు, విద్యార్థుల వసతి, భోజన సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్‌, క్రీడా సౌకర్యాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని తెలిపారు. నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి పాఠశాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్‌ సూచించారు. అచ్చంపేట నియోజకవర్గ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు అందించడంలో ఈ ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల కీలకంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. కలెక్టర్‌ వెంట సంబంధిత అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు