కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది?

02-10-2026 | 05:05am

ఓట్లప్పుడు బీసీ రాగం.. పదవుల పంపిణీలో అగ్రవర్ణ ప్రాధాన్యం! కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Declaration) నుంచి రాహుల్‌గాంధీ పార్లమెంటు ప్రసంగాల వరకు సామాజిక న్యాయం ప్రకటనలన్నీ ఆచరణలో ఎందుకు కనిపించడం లేదు? బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తామన్న కాంగ్రెస్‌పా ర్టీ, కీలకమైన రాజకీయ అవకాశాల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు వెనకడుగు వే స్తోంది? సామాజిక న్యాయం.. సమాన త్వం.. బహుజన రాజ్యాధికారం.. ఇవి కాం గ్రెస్ పార్టీ రాజకీయ వేదికలపై తరచూ వినిపించే ఆకర్షణీయమైన నినాదాలు.

ముఖ్యంగా బీసీలకు రాజకీయ అధికారంలో తగిన వాటా కల్పిస్తామని, అణగారిన వర్గాలకు పాలనలో భాగస్వామ్యం కల్పిస్తామని కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల ముందు చేసిన ప్రకటనలు అన్నీఇన్నీ కావు. బీసీల జనాభాకు అనుగుణంగా వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలంటూ రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా గళమెత్తారు. కానీఆచరణలో మాత్రం కాంగ్రెస్ అనుసరిస్తున్న రాజకీయ వైఖరి ఇప్పుడు బీసీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

ము ఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల విషయంలో ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యం కల్పించడంపై బీసీ సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సామాజిక న్యాయం గురించి మాట్లాడే కాంగ్రెస్‌కు బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించే విషయంలో మాత్రం ఆ న్యాయం ఎందుకు గుర్తుకు రావడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఎన్నికలకు ముందు బీసీలే దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలని, జనాభాలో అధికంగా ఉన్న బీసీలకు అధికారంలోనూ తగిన వాటా దక్కాలని రాహుల్‌గాంధీ పదేపదే ప్రకటించారు. కులగణన ద్వారా సామాజిక వర్గాల వాస్త వ పరిస్థితులను వెలుగులోకి తీసుకురావాలని, రాజ్యాంగ పరిరక్షణతో పాటు సామా జిక అసమానతలను తొలగించాలని పార్లమెంటు వేదికగా తన వాదనను వినిపిం చారు.  ఈ ప్రకటనలతో బీసీ సమాజంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఎన్నో ఆశలు చిగురించాయి.

తమకు రాజకీయంగా కొత్త అవకా శాలు వస్తాయని, దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్న బీసీ వర్గాలకు నిర్ణ యాధికారంలో భాగస్వామ్యం లభిస్తుందని ఆశించారు. కానీ, ఇప్పుడు కీలకమైన రాజకీయ పదవుల పంపిణీ దగ్గరకు వచ్చేసరికి ఆ ఆశలకు గండిపడుతోందనే విమ ర్శలు వినిపిస్తున్నాయి. బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తామన్న మాటలు కేవలం ఎన్ని కల ప్రచారానికి పరిమితమై తే, ఆ నినాదాలకు విశ్వసనీయత ఎక్కడ మిగులుతుంది?

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బీసీ వర్గాల మద్దతు కూడా కీలకమైన రాజకీయ అంశం. బీసీ డిక్లరేషన్ పేరుతో కామారెడ్డిలో ప్రకటించిన హామీలు ఆ వర్గాల్లో రాజకీయ చైతన్యాన్ని పెంచాయి. బీసీలకు సముచిత ప్రాతిని ధ్యం, సామాజిక న్యాయం, రాజకీయ అవకాశాల విస్తరణపై కాంగ్రెస్ చేసిన ప్రకటన లు అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత వేగంగా అమలవుతాయని ప్రజలు ఆశించారు.

కానీ, పట్టభద్రుల స్థానాల అభ్యర్థుల ఎంపికలో బీసీలకు తగిన ప్రాధాన్యం దక్కకపోవడం ఆ హామీల అమలుపై అనుమా నాలను పెంచుతోంది. కామారెడ్డి డిక్లరేషన్‌లోని హామీలకు కాలపరిమితితో కూడిన కార్యాచరణ ఏమిటి? బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు పార్టీ విధానం ఏమిటి? బీసీలకు అవకాశాలు కల్పిం చే విషయంలో కాంగ్రెస్ నాయకత్వం పా టిస్తున్న ప్రామాణికాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బా ధ్యత ఆ పార్టీ నాయకత్వంపై ఉంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు విద్యావంతు లైన యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావుల సమస్యలను శాసనమండలిలో ప్రతిధ్వనింపజేసే కీలకమైన వేదికలు. అలాంటి స్థానాల్లో అభ్య ర్థుల ఎంపిక కేవలం రాజకీయ సమీకరణాలకు పరిమితం కాకుండా సామాజిక ప్రాతి నిధ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.ఒకే సామాజిక వర్గా నికి చెందిన ఇద్దరు అభ్యర్థులకు అవకాశం కల్పించి, బీసీలకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశాన్ని విస్మరించారనే విమర్శలు వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయానికి సంబంధించిన కారణాలను ప్రజలకు వివరించాలి.

అభ్యర్థుల ఎంపికలో అర్హతలు, ప్రజాదరణ, రాజకీయ అనుభవం ముఖ్యమని చెప్పే పార్టీలు.. సామాజిక న్యాయం విషయంలోనూ అదే స్థాయి నిబద్ధతను చూపించాలి. లేకపోతే సామాజిక న్యాయం అనే పదం రాజకీయ అవ సరాలకు అనుగుణంగా వాడుకునే నినాదంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు బీసీ నాయకులకు కొన్ని కీలక పదవులు కేటాయించామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవచ్చు. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అవకాశం కల్పించడం, బీసీ నేతలకు ఇతర పదవులివ్వడం పార్టీ తీసుకున్న నిర్ణయాలుగా ప్రస్తావించవచ్చు.

అయితే ఒకరిద్దరు బీసీ నాయకులకు పదవులు కట్టబెట్టడమే బీసీ సమాజానికి సంపూర్ణ రాజకీయ న్యాయం చేసినట్లు ఎలా అవుతుంది? ఒక నాయకుడికి పార్టీ పదవి ఇవ్వడం వేరు.. బీసీ సమాజానికి రాజకీయ అధికారంలో విస్తృతమైన భాగస్వా మ్యం కల్పించడం వేరు. బీసీలకు ప్రాతిని ధ్యం కల్పించామనే రాజకీయ ప్రచారానికి, వాస్తవంగా బీసీ వర్గాలకు లభిస్తున్న అవకాశాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పరిశీ లించాల్సిన అవసరం ఉంది. పార్టీ పదవులు, శాసనసభ, మండలి స్థానాలు, నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ నిర్ణయా ల్లో భాగస్వామ్యం.. ఇలా అన్ని స్థాయుల్లో బీసీలకు ఎలాంటి అవకాశాలు కల్పించారన్నదే అసలు గీటురాయి కావాలి.

బీసీలను రాజకీయంగా చైతన్యవంతం చేయడం ఒక ఎత్తయితే, ఆ చైతన్యాన్ని అధికారంలో భాగస్వామ్యంగా మార్చడం మరో ఎత్తు.  బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి, కీలకమైన పదవుల పంపిణీలో వారికి తగిన ప్రాధాన్యత కల్పించకపోతే అది రాజకీయంగా విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తామని చెప్పే పార్టీలు తమ అంతర్గత నిర్ణయాల్లోనే సామాజిక సమానత్వాన్ని పాటిం చలేకపోతే, ప్రభుత్వ పాలనలో సామాజిక న్యాయాన్ని ఎలా సాధిస్తాయన్న ప్రశ్న సహజంగానే వస్తుంది.

ఈ నేపథ్యంలో బీసీ సంఘాలు కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న విమర్శలను కేవలం రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేయకుండా, వాటికి సమా ధానం చెప్పడం ప్రజాస్వామ్య బాధ్యతగా భావించాలి. రాహుల్‌గాంధీ పార్లమెంటు లో రాజ్యాంగాన్ని చేతబట్టి సామాజిక న్యాయం గురించి మాట్లాడటం ఎంత ముఖ్యమో, అదే రాజ్యాంగ స్ఫూర్తిని పార్టీ రాజకీయ నిర్ణయాల్లో ప్రతిబింబించడం కూడా అంతే ముఖ్యం.

బీసీల జనాభా, వారి సామాజిక వెనుకబాటుతనం, విద్య, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ ప్రాతినిధ్య లోటుపాట్లపై చర్చ జరగాలి. ఆ చర్చ కేవ లం సభలకే పరిమితం కాకుండా అభ్యర్థుల ఎంపిక నుంచి పాలనా నిర్ణయాల వరకు ప్రతిఫలించాలి. బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో ఏవైనా పరిమితులు ఉంటే వాటిని స్పష్టంగా వివరిం చాలి. భవిష్యత్తులో బీసీలకు ఎంత మేర ప్రాతినిధ్యం కల్పించాలనే అంశంపై పార్టీ తన విధానాన్ని ప్రకటించాలి.

సామాజిక న్యాయం అనేది ప్రసంగా ల్లో పలికే పదం కాదు.. ప్రజల జీవితా ల్లో మార్పు తీసుకురావాల్సిన రాజకీయ బాధ్యత. బీసీలను ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకుగా గుర్తించి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి రాజకీయ ఆకాంక్షలను విస్మరిస్తే ఆ వర్గాల్లో అసంతృప్తి పెర గడం సహజం. పట్టభద్రుల స్థానాల విషయంలో బీసీలకు ప్రాతినిధ్యం దక్కలేదన్న విమర్శలకు కాంగ్రెస్ సమాధానం చెప్పా లి. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేసి, బీసీలకు రాజకీయంగా కల్పించిన అవకాశాల వివరాలను ప్రజల ముందుంచాలి.

బీసీలకు రాజ్యాధికారం ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక కీలకమైన ప్రశ్న ఎదురవుతోంది. బీసీలకు అధికారంలో భాగ స్వామ్యం కల్పించాలన్నది నిజమైన రాజకీయ విధానమా? లేక ఎన్నికల వేళ ఓట్లు రాబట్టుకునేందుకు ఉపయోగించే నినాదమా? ఈ ప్రశ్నకు సమాధానం రాహుల్ గాంధీ ప్రసంగాల్లోనో, కాంగ్రెస్ నేతల ప్రకటనల్లోనో కాకుండా, పార్టీ తీసుకునే రాజ కీయ నిర్ణయాల్లో కనిపించాలి.

బీసీలకు పూలమాలలు వేసి, వేదికలపై సన్మానాలు చేసి, సామాజిక న్యాయం గురించి ఉపన్యాసాలు ఇస్తే రాజ్యాధికారం వచ్చినట్లు కాదు. నిర్ణయాధికారంలో వాటా కల్పించినప్పుడే సామాజిక న్యాయానికి నిజమైన అర్థం ఉంటుంది.బీసీలకు ఇచ్చిన హామీలు ఆచరణలో కనిపించాలి.. లేకపోతే సామాజిక న్యాయం పేరుతో చేసిన రాజకీయ వాగ్దానాలు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ఖాళీ నినాదాలుగానే మిగిలిపోతాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీసీల తడాఖా ఏమిటో చూపించాల్సిన అవసరం ఏర్పడుతుందనేది నగ్న సత్యం.

సామాజిక రాజకీయ విశ్లేషకులు

మన్నారం నాగరాజు

మరిన్ని వార్తలు