ముస్తాబవుతున్న కోర్టు భవనం..
తీరనున్న తూప్రాన్ ప్రజల కల..
ఏళ్ల తరబడి ఇబ్బందులు పడ్డ ప్రజలు..
తూప్రాన్, సెప్టెంబర్ 30: గత కొన్ని సంవత్సరాలుగా తూప్రాన్(Toopran) పట్టణంలో కోర్టు భవనం ఏర్పాటుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేయడం జరిగింది. గతంలో కోర్టు భవన(Court Building) ఏర్పాటు కొరకు పుట్టకోట స్కూల్ భవనాన్ని పరిశీలించారు. కానీ అది ఆశించినంత సౌకర్యంగా లేదు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టణ అభివృద్ధిలో భాగంగా కోట్ల రూపాయల నిధులను వెచ్చించి ఇంటిగ్రేటెడ్ కూరగాయల సముదాయాన్ని కూరగాయల వ్యాపారస్తులు నిమిత్తం నిర్మాణం చేయడం జరిగింది. ఇది మున్సిపల్ కార్యాలయానికి కాస్త దూరంగా ఉన్న నెపంతో గత కొంతకాలంగా నిర్విరీయంగా ఉండడంతో ఈ భవనాన్ని సైతం జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కానీ ఇది కోర్టు భవనానికి అనుకూలంగా లేకపోవడంతో అధి కాస్త నిలిపివేయడం జరిగింది.
నెరవేరనున్న తూప్రాన్ ప్రజల కల..
ఇదిలా ఉండగా తూప్రాన్ మండల సమీకృత నూతన భవనం నిర్మాణం చేయడం. అందులో అన్ని శాఖల అధికార యంత్రాంగం కొలువుదీరడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ఎంపీడీవో కార్యాలయ భవనం ఖాళీగా ఉండడంతో గత నాలుగు నెలల క్రితం జిల్లా కోర్టు న్యాయమూర్తి, కలెక్టర్ ఈ భవనాన్ని పరిశీలన చేసి అనుకూలంగా ఉండడంతో ఈ భవనాన్ని కోర్టు భవనంగా ప్రతిపాదించారు. ఇది కాస్త పాత భవనం కావడంతో జిల్లా న్యాయమూర్తి 30 లక్షల నిధులను మంజూరు చేసి ఈ కోర్టు భవనాన్ని అన్ని వసతులతో చక్కగా తీర్చిదిద్దాలని సూచించారు.
ఈ క్రమంలో కోర్టుకు అనుకూలంగా అన్ని వసతులతో కావలసిన విధంగా భవనాన్ని చక్కదిద్దుతున్నారు. అంతే కాకుండా కోర్టు ముందర భాగం ప్రస్తుతం సుందరంగా సీసీ రోడ్డు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అనంతరం కోర్టు భవనం పూర్తి కాగానే భవనాన్ని ప్రారంభించడానికి జిల్లా న్యాయమూర్తులు, ఉన్నత అధికారులు, సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇక తూప్రాన్ మున్సిపల్ ప్రజల కల నెరవేరుతుంది.