గురుకుల టెండర్ల అవకతవకలపై విచారణ చేయాలి
- కేంద్ర, రాష్ట్ర విజిలెన్స్ సంస్థలకు సామాజిక కార్యకర్త రాజేశ్ కుమార్ ఫిర్యాదు
- వస్తువుల కొనుగళ్ల టెండర్లలో భారీగా తేడాలు
- రూ. 2 వేల కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు
- వాస్తవాలు బయటకు రావాలంటే విచారణ చేయాలని విజ్ఞప్తి
విచారణ కోసం రాజేశ్‌కుమార్ ప్రస్తావించిన అంశాలు:
- స్కూల్ కిట్స్ పథకం, గురుకుల సంస్థల కోసం పీఎంయూ అనుసరించిన టెండరింగ్ ప్రక్రియపై సవివరమైన విచారణ జరపాలి.
- కొనుగోలు ధరలు ప్రస్తుత మార్కెట్ ధరలకు తగ్గట్టు ఉన్నాయో లేదో పరిశీలించాలి.
- విజయవంతమైన బిడ్డర్లను ఎంపిక చేయడానికి ఉపయోగించిన ప్రమాణాలను, వారి గత పనితీరును క్షుణ్ణంగా పరిశీలించాలి.
- ఏవైనా టెండర్ నిబంధనలు ఒక నిర్దిష్ట విక్రేతకు లేదా విక్రేతల వర్గానికి అనవసరంగా అనుకూలంగా ఉన్నాయో లేదో నిర్ధారించాలి.
- అవకతవకలు జరిగినట్లు తేలినచోట పరిపాలనా జవాబుదారీతనాన్ని నిర్ధారించడంతో పాటు నిబంధనలకు లోబడి, విచారణ ఫలితాన్ని తనకు తెలియజేయాలి. అవసరమైతే అదనపు పత్రాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాను.
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల కోసం ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ చేపట్టిన కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ చేయాలని సామాజిక కార్యకర్త జీ రాజేశ్‌కుమార్(Social Activist G. Rajesh Kumar) అన్నారు.
ఈ మేరకు ఆయన కేంద్ర, రాష్ట్ర విజిలెన్స్ సంస్థలతో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆహార పదార్థాలు, శుభ్రపరిచే సామగ్రి, ట్రంక్ బాక్సులు, ట్రాలీబ్యాగులు, ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, కప్పులు, పీటీ డ్రెస్సులు, నైట్ డ్రెస్సులు, ట్రాక్ సూట్లు, కార్పెట్లు, బెడ్‌షీట్స్, పోలార్ ఫ్లీస్ దుప్పట్లు, టవల్స్, స్కూల్ బ్యాగులు, బూట్లు, సాక్సులు, టైలు, బెల్టులు, ఐడీకార్డు హోల్డర్లు, స్టేషనరీ కిట్లతోపాటు యూ నిఫాం బట్టల సరఫరా కోసం జారీ చేసిన టెం డర్లలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయని ఫిర్యాదులో ప్రస్తావించారు.
ఈ కొనుగోళ్లలో రూ.2వేల కోట్ల వరకు అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు(BRS leader Harish Rao), ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపణలు చేశారని పేర్కొన్నా రు. యూనిఫాంలు, పరుపు సామాగ్రి కోసం పీఎంయూ టెండర్‌కు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగిందని తెలిపారు.
తెలంగాణ చేనేతల సహకార సంఘం ద్వారా చేనేత వస్తువుల సేకరణలో నిర్దేశిత విధానాన్ని పాటించలేదన్నారు. టెండర్లలో కచ్చితమైన విధానాన్ని పాటించాలని అధికారులను కోర్టు ఆదేశించిందని, అయితే టెండర్ల రూపకల్పనలో ఉత్తర్వులను పాటించారా లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవాలు బయటికి రావాలంటే విచారణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
బంకర్ బెడ్ల కొనుగోళ్లలోనూ తేడా
కేజీబీవీల కోసం తెలంగాణ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ జారీ చేసిన ప్రత్యేక టెండర్ కింద బంకర్ బెడ్ల కొనుగోలుపై కూడా రాజేశ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. విజయవంతమైన బిడ్డర్లలో మఫత్‌లాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒకటని ఆయన పేర్కొన్నారు. ఆ కంపెనీ ఒక్కో బంకర్ బెడ్‌కు రూ. 33వేల ధరను కోట్ చేయగా, కోర్టు విచారణలో ఉదహరించిన 2025 డిసెంబర్ 5 నాటి కొనుగోలు ఆర్డర్లో యూనిట్‌కు రూ.17,200 మాత్రమే ఉందని తెలిపారు. ఈ ధరల వ్యత్యాసం వల్ల రాష్ట్ర ఖజానాపై భారీగా ఆర్థికభారం పడి ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సరఫరాదారు నిర్దేశించిన 120 రోజుల వ్యవధిలోగా సరఫరాను పూర్తి చేయడంలో విఫలమయ్యారని, తదనంతరం గడువు పొడిగింపులు మంజూరు చేశారని కూడా అందులో ప్రస్తావించారు. ఈ విషయానికి సంబంధించి రూ. 160 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గతంలో హైకోర్టులో రిట్ పిటిషన్ నెం. 40073/2025 ను దాఖలు చేశారని వివరించారు. సుప్రీంకోర్టులో జరిగిన సంబంధిత విచారణలతోపాటు కొనుగోలు ప్రక్రియను, తదనంతర పరిపాలనా నిర్ణయాలను పరిశీలించాలని విజిలెన్స్ అధికారులను కోరారు. విద్యార్థులకు అందించినన యూనిఫాంలు, ఇతర సామగ్రి నాణ్యతకు సం బంధించిన ఫిర్యాదులనూ పొందుపరిచారు.
నాకోఫ్ అర్హతపై అనుమానాలు
ఆహార సరఫరాలు, శుభ్రపరిచే సామగ్రికి సంబంధించిన టెండర్లలో నాకోఫ్ సంస్థ పాల్గొనడంపై కూడా రాజేశ్‌కుమార్ ప్రశ్నలు లేవనెత్తారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ జారీ చేసిన 2025 సెప్టెంబర్ 9నాటి జీవో 15ను ఆయన ప్రస్తావించారు. వడ్ల సేకరణ (లిఫ్టింగ్) విషయంలో నాఫ్కో గతంలోనే ‘సమర్థవంతంగా పనిచేయని సంస్థ’గా లిస్టులో చేరిందని తెలిపారు.
ఈ సంస్థకు ఏ ని బంధనల ఆధారంగా టెండర్లో పాల్గొనడాకి అవకాశం ఇచ్చారనే అంశంపై విచారణ చేయాలన్నారు. టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శిగా కంభంపాటి శారద నియామకం, పీఎం యూ చైర్‌పర్సన్‌గా ఆమె పోషిస్తున్న పాత్రపై కూడా విచారణ చేయాలని కోరారు. ప్రధాన పథకాల అమలును పర్యవేక్షిస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ పాత్రను కూడా ప్రస్తావించారు. తాను ఏ ఒక్క అధికారిపైనా వ్యక్తిగత బాధ్యతను ఆపాదించడం లేదన్నారు.